భ‌ద్రాద్రిలో రూ.52 కోట్ల పెట్టుబ‌డి మోసం.. కేర‌ళలో కేటుగాడు అరెస్ట్

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ పెట్టుబడి మోసం (Investment Scam) కేసుకు సంబంధించి జిల్లా పోలీసులు గ్రాండ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో కాంట్రాక్ట్ పనుల పేరుతో అమాయకుల నుంచి ఏకంగా రూ. 52 కోట్లు నొక్కేసిన కేటుగాడి గుట్టును రట్టు చేశారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడిని కేరళలో అదుపులోకి తీసుకోవడంతో పాటు, అతడి వద్ద నుంచి 35 వాహనాలు, కోట్లాది రూపాయల స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆపరేషన్ పూర్తి వివరాలను వెల్లడించారు.

​బాధితుడు భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ మోసపూరిత వ్యూహాన్ని పోలీసులు ఛేదించారు. నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నానని, తన వ్యాపారంలో భాగస్వాములుగా చేరితే ప్రతి నెల‌ 4 శాతం లాభాల వాటా ఇస్తానని నమ్మబలికాడు. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు బీకే నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ నకిలీ భాగస్వామ్య ఒప్పంద పత్రాలను సృష్టించాడు. ఈ ఆకర్షణీయమైన మాటలు, తప్పుడు కాగితాలను నమ్మి పలువురు బాధితులు ఏకంగా రూ. 52 కోట్ల మేర పెట్టుబడులు పెట్టి తీవ్రంగా మోసపోయారని దర్యాప్తులో తేలింది.

​బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడి కదలికలను కనిపెట్టింది. కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో తలదాచుకున్న నిందితుడిని పక్కా ప్లాన్‌తో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తరలించారు. అనంతరం పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించగా మోసపూరిత సొమ్ముతో కొనుగోలు చేసిన భారీ ఆస్తుల భాగోతం బయటపడింది.

​విచారణ ఆధారంగా అక్రమ ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బాధితుల సొమ్ముతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కొనుగోలు చేసిన ఒక మూడు అంతస్తుల భవనాన్ని, ఒక ప్లాట్‌ను సైతం గుర్తించి జప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, మనీ ట్రైల్‌పై పరిశీలన కొనసాగుతోందని, మరికొందరు బాధితులను గుర్తించే దిశగా దర్యాప్తు వేగవంతం చేశామని వెల్లడించారు.

​ఈ అత్యంత సంక్లిష్టమైన కేసును వేగవంతంగా ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు, తక్కువ సమయంలో రెట్టింపు లాభాలు లేదా భారీ రాబడులు ఇస్తామనే ఆకర్షణీయమైన పథకాలను (Investment Scam) గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. నకిలీ పత్రాలు, ఒప్పందాలతో మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద పెట్టుబడి వ్యవహారాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also Read : స్వర్ణాంధ్ర అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకం: పీఎం మోడీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>