కలం, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల పాదాలు కడుగుతానని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipalli Satyam) పేర్కొన్నారు. శనివారం గంగాధర మండలం పాపాయపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఆఫీసర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే చొప్పదండితోపాటు వేములవాడ నియోజకవర్గానికి కూడా సాగునీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.23.5 కోట్లు మంజూరు చేశారని.. మరో రూ.20 కోట్లు త్వరలో విడుదల అవుతాయని పేర్కొన్నారు.
‘కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉండొద్దు..’
పార్టీలతో సంబంధం లేకుండా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వివరించారు. గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుందన్నారు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జేఎన్టీయూ ఇస్తే.. నేడు మరిన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. చొప్పదండి ప్రజలు నన్ను గెలిపించినందుకు చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, ఇతర అధికారులను కోరారు. తాను కూడా కేంద్రాలను తనిఖీ చేస్తానని.. గత ప్రభుత్వంలో మాదిరి ఇష్టానుసారం తూకంలో కోతలు విధించొద్దని ఆదేశించారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని.. ఎన్నికల తరువాత ఊరి అభివృద్ధి పై దృష్టి సారించాలని నూతన సర్పంచులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు: కలెక్టర్
కలెక్టర్ చిత్రమిశ్రా మాట్లాడుతూ.. శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్త్రీ శిశు సంక్షేమం, స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇల్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి భారీగా దరఖాస్తులు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రభుత్వ పథకాలు పొందిన, పొందుతున్న లబ్ధిదారుల వివరాలు వివరించారు.

