పొంగులేటి(Ponguleti Srinivas Reddy), కొండా దంపతుల వివాదం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరింది. తనపై సహచర మంత్రి కొండా సురేఖ(Konda Surekha).. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మంత్రి పొంగులేటి తాజాగా స్పందించారు. అసలు ఏముందని ఫిర్యాదు చేస్తారని అడిగారు. ‘‘నేనేంటో అందరికీ తెలుసు. రూ.70 కోట్ల ప్రాజెక్ట్ కోసం తాపత్రయపడాల్సిన అవసరం నాకు లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నా మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏం ఉంది. సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క-సారక్కలా పనిచేస్తున్నారు’’ అని పొంగులేటి అన్నారు. అయితే మేడారం(Medaram) ఆలయ టెండర్ల విషయంలో కొండా, పొంగులేటి మధ్య అగ్నిజ్వాలలు రగిలాయి. ఈ క్రమంలోనే కొండా సురేఖ.. పార్టీకి ఫిర్యాదు చేశారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క.. సోమవారం మేడారం సమ్మక్క, సారక్కను దర్శించుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. మహా జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, దేవతల దర్శనం తదితర అంశాలపై చర్చించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. మేడారం అభివృద్ధికి రూ.212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని, నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని సూచించారు. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటాం, కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే రూ.101 కోట్లు కేటాయించాం, ఎంత ఖర్చయినా సరే మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Read Also: పోలీసులకు డీజీపీ శివధర్ స్ట్రాంగ్ వార్నింగ్

