కలం, వెబ్‌డెస్క్: రాబోయే కొద్ది రోజుల్లో 32 జిల్లాలలో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను గుర్తించి సర్వే పూర్తిచేసి భూధార్ కార్డులను అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. తమ ప్రభుత్వం భూభారతి పోర్టల్ (Bhu Bharati) ను తీసుకువచ్చిన తరువాత సాదాబైనామాలు చేర్చామన్నారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. భూభారతిలో ఒక పరిష్కారం కనుగొంటామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా కృషిచేస్తోందని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాల్లో భూ సర్వే చేయలేదని అన్నారు.
దీంతో భూములున్న ఆసాములు, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వీటితో పాటు ఇంకా మిగిలి ఉన్నఅనేక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో భూసర్వే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద 5 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి భూ సర్వే పూర్తి చేశామని చెప్పారు. మనిషికి ఆధార్ ఎలాగో అదేవిధంగా భూభారతి చట్టంలో (Bhu Bharati Act) నిబంధనల ప్రకారం భూధార్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన 408 గ్రామాల్లో కూడా దాదాపుగా సర్వే పూర్తి కావొచ్చిందని పేర్కొన్నారు.
జీవో నెం.76 ద్వారా రైతులకు సాధాబైనామ సమస్యకు సులభతరంగా పరిష్కారం లభించబోతుందని కౌన్సిల్‌లో మంత్రి (Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. సాధాబైనామ ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు ఇక నుండి అమ్మినవారి నుండి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని.. కొనుగోలుదారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది కానీ.. 2020 ఆర్‌ఓఆర్ చట్టంలో పరిష్కార మార్గాన్ని రూపొందించలేదని అన్నారు. తద్వారా 9 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యకు భూ భారతి చట్టంలో తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారంచూపించిందన్నారు.
అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫ్ఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడంవల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని.. వీలైనంత త్వరలోనే వాటిని పరిష్కరించబోతున్నామని ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ కోసం భూభారతి పోర్టల్‌ను తీసుకువచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకురాగా.. దీని స్థానంలో భూ భారతి ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Read Also: నవరాత్రి వేళ సుందరకాండ పఠనంతో శుభఫలితాలు
Follow Us On: X(Twitter)

