కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. ముఖ్యంగా సాదాబైనామా దరఖాస్తులను అర్హత మేరకు రాబోయే 35 రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. సాదాబైనామా పేరుతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. అటువంటి దరఖాస్తులను వెంటనే తిరస్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోపు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన అనంతరం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజక వర్గం ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెంలో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి (Ponguleti) ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఇప్పటి వరకు నిర్వహించిన 7 క్లస్టర్ల పరిధిలో వచ్చిన 10 వేల దరఖాస్తులలో 5 వేల వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసమే రావడం వాటి అవసరాన్ని సూచిస్తోందని తెలిపారు. వీటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రెండు, మూడు, నాలుగు విడతల్లో అర్హులైన పేదలందరికి ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.
పాలేరు (Paleru) నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల తొలగింపు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, మంగళగూడెం క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !
Follow Us On : WhatsApp

