Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !

కలం, నేషనల్ డెస్క్: వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నది. 207 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన బీజేపీ.. సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని భావిస్తున్నది. 15 ఏండ్ల టీఎంసీ పాలనకు ఫుల్స్టాప్ పెట్టి.. బెంగాల్‌ను గెలుచుకున్న పార్టీ హైకమాండ్.. సీఎం ఎంపిక బాధ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అప్పగించింది. సీఎం రేసులో ( West Bengal CM Race ) అగ్నిమిత్ర పౌల్, రూపా గంగూలీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అగ్నిమిత్ర పౌల్ అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.

మహిళల భద్రతే ఎజెండాగా..

ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. మహిళల భద్రతను కీలక అంశంగా తీసుకుంది. ఆర్.జి. కర్ హాస్పిటల్ ఘటన వంటి విషయాలను ఎత్తిచూపుతూ మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టిన బీజేపీ.. ఇప్పుడు మహిళా నేతకు పట్టం కట్టడం ద్వారా తన మహిళా పక్షపాతి ముద్రను దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నది. బీజేపీ హైకమాండ్ పరిశీలనలో ఉన్న కీలక మహిళా నేతల్లో రూపా గంగూలీ పేరు కూడా వినిపిస్తున్నది. ఎన్నికల్లో మహిళల భద్రతను బీజేపీ మెయిన్ ఎజెండాగా ప్రచారం చేసింది. మహిళా ఓటర్ల నాడి తెలిసిన రూపా గంగూలీ వంటి నేతను ఎంపిక చేయడం ద్వారా బెంగాల్ మహిళల్లో భరోసా కల్పించాలని పార్టీ భావిస్తోంది.

ఎవరీ అగ్నిమిత్ర పౌల్

అగ్నిమిత్ర పౌల్ ఫ్యాషన్ డిజైనర్. ఆమె ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటులకు డిజైన్లను అందించారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఉంది. మమతా బెనర్జీపై ఆమె చేసే పదునైన విమర్శలు ఆమెను సీఎం రేసులో ముందుంచాయి.

ఎవరీ రూపా గంగూలీ?

మహాభారత్ సీరియల్లో ద్రౌపది పాత్రతో ఇంటింటికీ పరిచయమైన రూపా గంగూలీకి పట్టణ ఓటర్లతో మంచి ఆదరణ ఉంది. మాజీ రాజ్యసభ సభ్యురాలు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. సోనాపూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచారు.

పురుషుల్లో సువేందు అధికారి ఫస్ట్!

సీఎం రేసులో మహిళా నేతలతో పాటు సువేందు అధికారి, దిలీప్ ఘోష్ వంటి సీనియర్ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయానికి కీలక భూమిక పోషించారు. ఈ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీపై ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో 15,105 ఓట్ల తేడాతో సువేందు అధికారి విజయం సాధించారు. మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలోనే ఓడించిన నేతగా, అటు పాలనాపరమైన అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన సీఎం పదవికి ప్రధాన పోటీదారుగా నిలిచారు.

గతంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం దిలీప్ ఘోష్‌కు ఉంది. ఆయన సారథ్యంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖరగ్‌పూర్ సదర్ స్థానం నుంచి విజయం సాధించారు. మాస్ లీడర్‌గా ఇమేజ్ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.

Read Also: టీవీకే విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు.. కేసీ వేణుగోపాల్ ఏమన్నారంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>