Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజాదర్బార్‌తో పెను మార్పులు: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి (Ponguleti)  స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలోని రాయిగూడెం క్లస్టర్ పరిధిలో శనివారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాయిగూడెం, అజయ్‌తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో పొంగులేటి ముఖాముఖి భేటీ నిర్వహించారు.

గతంలో దారుణ పరిస్థితి

గతంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక ఇబ్బందులు పడ్డారని, కానీ నేడు అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు వింటున్నారని మంత్రి తెలిపారు. “ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. మీ కష్టాలను వినే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టే ధైర్యంగా మీ మధ్యకు రాగలుగుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

సమస్యలు లోతుగా అధ్యయనం

ప్రజాదర్బార్‌ను కేవలం సభలా కాకుండా, ప్రతి పంచాయతీకి అధికారులను కేటాయించి సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. స్పాట్‌లోనే పరిష్కరించే వీలున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వాటికి వారం, నెల, మూడు నెలల చొప్పున గడువు నిర్ణయించి పరిష్కరించాలని సూచించారు.

ఎన్నికల వరకే రాజకీయాలు

‘రాజకీయాలు ఎన్నికల వరకే. గెలిచిన తర్వాత ప్రభుత్వం అందరిది. అడిగిన పని న్యాయమైనదైతే, ప్రజలకు ఉపయోగపడేదైతే తప్పకుండా పూర్తి చేస్తాం” అని మంత్రి వివరించారు. ఈ నియోజకవర్గంలో చేస్తున్న ఈ ప్రయోగం రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయడానికి ఒక నమూనాగా నిలుస్తుందని ఆకాంక్షించారు. 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి సమస్యలను పారదర్శకంగా, వడివడిగా పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు.

పెద్దకొడుకుగా కష్టాలు తీరుస్తా

‘మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నన్ను గెలిపించారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ కష్టాలను తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అసాధ్యమైన హామీలు నేను ఇవ్వను కానీ మీరు అడిగే సమస్య న్యాయమైందైతే దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది” అని మంత్రి (Ponguleti) పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

Read Also: అజారుద్దీన్​, కోదండరాంలకు లైన్​ క్లియర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>