కలం, వెబ్ డెస్క్: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పుదుచ్చేరి (Puducherry)లో 30 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల్లో 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పుదుచ్చేరిలో మొత్తం 9 లక్షల 50 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరిలో మొదటిసారి విజయ్ టీవీకే పార్టీ బరిలో ఉంది. మొత్తం 30 స్థానాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కొత్త పార్టీ అయినప్పటికీ ప్రత్యర్థులకు టీవీకే గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అస్సాం (Assam) రాష్ట్రంలో సైతం పోలింగ్ మొదలైంది. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 2.49 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లక్షన్నర మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అస్సాంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇక కేరళ (Kerala)లో సైతం ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 890 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యుడీఎఫ్, ఎన్డీయే కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.
ఈ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
మూడు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు కర్ణాటకలో దావణగెరె సౌత్, బాగల్‌కోట్, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. గోవాలో సైతం పోండా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, ఇటీవల కోర్టు అక్కడి ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని తీర్పు నివ్వడంతో ఎన్నిక రద్దయ్యింది.

