కలం, క్రైమ్ బ్యూరో : బండి భగీరథ్ (Bandi Bhagirath) కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. భగీరథ్ ఫోన్ (ఐఫోన్ 17 ప్రొ)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. బాధితురాలితో భగిరథ్ చేసిన చాటింగ్స్, వీడియోలు, ఫొటోలు ఇతర సమాచారాన్ని ఫోరెన్సిక్‌ల్యాబ్ ద్వారా తెప్పించుకోనున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టుకు సమర్పిస్తారు. కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసులు శనివారం నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచీరేవుల టెక్ పార్క్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి రెండు గంటలపాటు విచారించి మేడ్చల్‌లోని మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు బండి భగీరథ్ చర్లపల్లి జైలుకు తరలించారు.
భగిరథ్‌కు మద్దతుగా పోస్టులు 14 మందిపై కేసు
మరోవైపు బండి భగిరథ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండి భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియా వేదికల్లో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు వరుసగా పోస్టులు, వీడియోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఇమేజ్‌ను క్లీన్ చేయడానికి వీరంతా భారీగా డబ్బు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. పోక్సో కేసు నిందితులకు అనుకూలంగా ప్రచారం చేయడం, బాధితుల వివరాలను పరోక్షంగా ప్రస్తావించడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మొత్తం 27 మందిపై ఫిర్యాదు అందింది. నిందితుడి తరఫున తప్పుడు ప్రచారం చేస్తూ.. విచారణను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ప్రాథమిక ఆధారాలు లభించడంతో మొదటి విడతగా మొత్తం 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.

