Mobile Popup Ad
Mobile Popup Ad

ఆలయాల ఆదాయాల్లో వేములవాడ రాజన్నకు రెండో స్థానం

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తుల వెల్లువతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దర్శన టికెట్లు, ప్రత్యేక పూజలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, హుండీ కానుకల ద్వారా దేవాలయాలకు వచ్చిన వార్షిక ఆదాయ వివరాలను దేవాదాయ శాఖ తాజాగా ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ పెరగడం, మౌలిక వసతుల కల్పన మెరుగుపడటంతో ఆలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో రూ. 93.87 కోట్ల రికార్డు ఆదాయంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

​రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి (Vemulawada Rajanna) దేవస్థానం రూ. 73.43 కోట్ల వార్షిక ఆదాయంతో రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాజన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహాశివరాత్రి జాతర, కార్తీకమాస ఉత్సవాలు, శ్రావణ మాస వేడుకల సమయంలో స్వామివారికి సమర్పించిన కోడెల ముడుపులు, హుండీ కానుకల ద్వారా ఈ స్థాయిలో రికార్డు రాబడి వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

​జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రూ. 21.98 కోట్ల ఆదాయాన్ని గడించి రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఆలయ పరిసరాల్లో ప్రభుత్వం చేపట్టిన భారీ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించిన అధునాతన మౌలిక సదుపాయాలు ఆలయ ఖ్యాతిని మరింత పెంచాయి. మంగళ, శనివారాలతో పాటు వారాంతాల్లో స్వామివారి దర్శనానికి, హనుమాన్ దీక్షల విరమణకు మునుపెన్నడూ లేని విధంగా దీక్షాపరులు, భక్తులు తరలిరావడంతో అంజన్న ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు దేవాదాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>