జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక ప్రచారం పతాకస్థాయికి చేరుకున్నది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తోంది. ఈ సమయంలో పార్టీలో జోష్ నింపేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ని రంగంలోకి దించాలని పార్టీ భావించింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం బోరబండ పరిధిలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి రద్దు చేయడం గమనార్హం. కానీ, బీజేపీ క్యాడర్ మాత్రం తాము కచ్చితంగా మీటింగ్ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: బీజేపీ
బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ ధర్మారావు పోలీసుల తీరును తప్పుపట్టారు. “మొదట అనుమతి ఇచ్చి ఇప్పుడు రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారు” అని విమర్శించారు. సాయంత్రం బోరబండలో సభ ఏ పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామంటూ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో పోలీసులు మాత్రం భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున అనుమతి నిలిపివేసినట్టు పేర్కొంటున్నారు. మరి బీజేపీ సభను నిర్వహించి తీరుతుందా? అన్నది వేచి చూడాలి.
కేంద్ర మంత్రి స్థాయి నేతకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడం, చివరి నిమిషంలో రద్దు చేయడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ దీనిని “ప్రజాస్వామ్యంపై దాడి”గా పేర్కొంటున్నది. మరి ఈ నిర్ణయం బీజేపీకే అనుకూలిస్తుందా? బండి సంజయ్(Bandi Sanjay) కు యువతలో క్రేజ్ బాగానే ఉంది. దీంతో ఆయన సభకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ(BJP) ఈ సభను నిర్వహిస్తే.. పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే అది బీజేపీకే మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోటీ కనిపిస్తోంది. ఈ సమయంలో బండి సంజయ్ పర్యటన సక్సెస్ అవుతుందా? పార్టీలో జోష్ తీసుకొస్తుందా? అసలు పోలీసులు ఈ సమావేశం నిర్వహణను ముందే అడ్డుకుంటారా? అన్నది వేచి చూడాలి.
Read Also: భారత్, పాక్ యుద్ధంలో కూలింది ఏడు జెట్లు కాదు ఎనిమిది: ట్రంప్
Follow Us on: Instagram

