Illegal Liquor Case | అన్నమయ్య జిల్లాలో బయటపడిన నకిలీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఓ ‘డైరీ’ పోలీసులకు చేతికి చిక్కింది. ఇది ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలోనే ఈ డైరీ వారికి దొరికింది. ఇందులో ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఉందని పోలీసులు తెలిపారు.
ఇందులో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్గ్ షాపుల నిర్వాహకుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 78 మంది పేర్లు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ డైరీ ఆధారంగా అందులో పేర్లు ఉన్న వ్యక్తులు బ్యాంకు లావాదేవీలు, యూపీఐ లావాదేవీల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు రాజకీయంగా కూడా కీలకంగా మారింది. ప్రభుత్వ సహకారంతోనే నకిలీ మద్యం(Illegal Liquor) దందా కొనసాగుతోందని, ఇందులో కూటమి నేతల హస్తం ఉందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసును తేలికగా తీసుకునేది లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారు ఎవరైనా వదిలిపెట్టమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు నేతలు చెప్తున్నారు.

