కలం డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం రాదని, బీసీలుగా మనమంతా ఐక్యంగా పోరాడి ఈ రిజర్వేషన్లు(BC Reservations) సాధించుకోవాలని ఆ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) వ్యాఖ్యానించారు. ఒక మంత్రిగా తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని, ఒక బీసీ బిడ్డగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని వివరణ ఇచ్చారు. నగరంలని ఓ హోటల్ లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్లను(BC Reservations) సాధించాలనే కసి నరనరానా ఉన్న మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం…. భవిష్యత్తు తరాలకు ఇంతటి కసి ఉంటుందో లేదో.. అందుకే మనమంతా ఐక్యంగా పోరాడి ఈ రిజర్వేషన్లను సాధించుకోవాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఊరికనే రిజర్వేషన్ కల్పిస్తాం అంటే మాటలు చెప్తే కుదరదు.. ఒక పక్రియ జరగాలి.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించి, వన్ మాన్ కమిషన్ సిఫారసుల మేరకు 42% బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిందని వివరించారు.
బీసీ కాకపోయినా రేవంత్ రెడ్డి చొరవ :
రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఎంత ఉన్నదో వారికి అంత శాతం మేర రిజర్వేషన్ ను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన చేశారని మంత్రి శ్రీహరి గుర్తుచేశారు. ఆ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా సర్వే చేయించారని తెలిపారు. చట్టబద్ధత ఉండేలా డెడికేటెడ్ కమిషన్, వన్ మాన్ కమిషన్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయించారు. ఆ సిఫారసులను ఆమోదించి చట్టసభల్లో బిల్లు పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు చట్టంగా రూపొందించే ప్రయత్నం చేశారన్నారు. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం పెడింగ్ లో ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చట్టాలు చేయడానికి లేదని, కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుందని, ఇప్పటికీ ఆ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నదని గుర్తుచేశారు.
కేంద్ర సర్కార్ తాత్సారం :
రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును పంపించి ఐదు నెలలు అవుతున్నా కేంద్రం నుండి ఎలాంటి స్పందనాలేదని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ ఉపయోగించి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. కానీ కొంతమంది రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అన్ని పార్టీలు, వర్గాలు ఒక్కటై కొట్లాడినట్లే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ఆలాంటి స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.
ఢిల్లీ వేదికగా ఒత్తిడి ప్రయత్నాలు :
ఆ లక్ష్యంలో భాగంగా అన్ని సామాజికవర్గాలను కలుపుకొని ఢీల్లి వేదికగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఢీల్లీలో పోరాటం చేశామని మంత్రి శ్రీహరి గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రతిపక్షాలకు సూచించారు. మనం కులాల వారీగా ఎవరికి వారుగా విడిపోతే టార్గెట్ రీచ్ కాలేమన్నారు. రిజర్వేషన్ క్రెడిట్ కోసం రాజకీయ పార్టీలు విడిపోతే ప్రయోజనం ఉండదన్నారు. బీసీలకు న్యాయం జరగడమే లక్ష్యంగా ఉండాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లి మరి కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

