కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇసుక మాఫియాపై (Sand Mafia) పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బొమ్మకల్ శివారులోని గొల్లపల్లివాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచారు. వీరు గతంలో కూడా ఇలాంటి కేసుల్లో ఉన్నారని, అందుకే వీరిపై నిఘా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన నగునూరి నాగరాజు, నగునూరి శ్రీనివాస్, దర్శనాల రాకేశ్ అనే వ్యక్తులను తహసీల్దార్ ఎదుట హాజరుపర్చారు. చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడకుండా లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు.
ఇప్పటికే బొమ్మ కిరణ్ అనే వ్యక్తి ఇసుక అక్రమ రవాణా చేస్తూ బైండోవర్ అయ్యారు. మరోసారి పట్టుబడగా లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తహసీల్దార్ ఎదుట హాజరుపర్చారు. మరోసారి అక్రమాలకు పాల్పడితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: రేపే జడ్జిమెంట్ డే.. కాళేశ్వరంపై ఏం జరగబోతుంది?
Follow Us On : WhatsApp

