కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జిల్లా న్యాయస్థానం, పోక్సో స్పెషల్ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. హనుమకొండ జిల్లా కేంద్రం హంటర్ రోడ్డులో నివాసం ఉంటున్న వల్లపు రాజు నాలుగేళ్ల క్రితం ఓ మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మాయి తల్లి రజిత అప్పట్లోనే స్థానిక సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజు మైనర్ అమ్మాయికి ఒక కొడుకు జన్మించాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం సోమవారం కీలక తీర్పును ఇచ్చింది.
ప్రస్తుతం వారు కలిసి కాపురం చేస్తున్నప్పటికీ సదరు కోర్టు నిందితునికి 20 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో రాజు భార్య సాహితీ, తల్లి పూలమ్మ కోర్టు ప్రాంగణంలో బోరున విలపిస్తున్న సందర్భంలో కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులు అందరూ ఆశ్చర్యానికి లోనాయ్యారు. తాము కలిసి కాపురం చేస్తున్నామని ఎంత ఏడ్చినా కోర్టు ఇలా తీర్పు ఇవ్వటం తట్టుకోలేక పోతున్నాం అని వారు వాపోయారు. మరోవైపు పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి ప్రవర్తన, పరిచయాల పై, వాళ్ళు వాడే ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టాలని పోలీసులు, న్యాయవాదులు సూచించారు.
Read Also: భారత్‌లో చైనా CCTV కెమెరాలపై నిషేధం.. ఎందుకంటే?
Follow Us On : WhatsApp

