కలం, వెబ్ డెస్క్: అది ఒక అభయారణ్యం.. చుట్టూ క్రూరమృగాల సంచారం.. కంటిచూపుకు ఆనని వెయ్యి అడుగుల లోతైన లోయలు.. కాలిబాట కూడా సరిగ్గా లేని ఇరుకైన కొండ దారులు.. అయినా సరే, ‘వస్తున్నాం లింగమయ్య’ అనే ఒకే ఒక్క నినాదం ఆ భయానక అడవిని భక్తి సాగరంగా మార్చేస్తుంది. అదే సలేశ్వరం జాతర (Saleshwaram Jathara)! దక్షిణాది అమర్‌నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన ఈ మహా అద్భుత ఘట్టానికి 2026 ఏప్రిల్ నెలలో ముహూర్తం ఖరారైంది.
డేట్స్ ఫిక్స్
ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఏడాది పొడవునా మూసి ఉండే ఈ అడవి బాటలను కేవలం ఈ ఐదు రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుస్తారు. ఏప్రిల్ 4న వచ్చే చైత్ర పౌర్ణమి నాడు లింగమయ్యకు జరిగే ప్రధాన పూజల కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
రాయిపై రాయి పేర్చితే సొంతిల్లు!
సలేశ్వరం జాతర (Saleshwaram Jathara) వెనుక ఉన్న భక్తుల నమ్మకాలు ఎంతో విచిత్రంగా, అద్భుతంగా ఉంటాయి. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు దారి పొడవునా చిన్న చిన్న రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తారు. ఇలా రాయిపై రాయి పేర్చితే ఆ లింగమయ్య దయతో సొంత ఇల్లు కట్టుకునే కల నెరవేరుతుందని వారి అచంచల విశ్వాసం. అలాగే, సంతానం లేని వారు ఈ ఐదు రోజుల్లో స్వామిని దర్శించుకుంటే ఫలితం ఉంటుందని నమ్ముతారు. 6వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన క్షేత్రం గురించి శ్రీ పర్వత పురాణంలోనూ ప్రస్తావన ఉండటం దీని విశిష్టతకు నిదర్శనం.
జలపాతంలో దాగున్న ఔషధం !
సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే అద్భుతమైన జలపాతమే ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ జలపాతాన్ని ‘శంకు తీర్థం’ అని పిలుస్తారు. ఈ నీరు నేరుగా లింగమయ్య పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. నల్లమలలోని వేల రకాల అడవి మూలికల మీదుగా ఈ నీరు వస్తుంది కాబట్టి, ఇందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తులు ఈ నీటిని బాటిళ్లలో నింపుకుని పవిత్ర తీర్థంగా ఇంటికి తీసుకెళ్తుంటారు.
ఎలా చేరుకోవాలి?
ఈ యాత్ర సాదాసీదాగా సాగేది కాదు. హైదరాబాద్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో, శ్రీశైలం వెళ్లే దారిలో ఈ క్షేత్రం ఉంది. శ్రీశైలం రహదారిలోని ఫరహాబాద్ నుంచి దట్టమైన అడవి గుండా 30 కిలోమీటర్ల వరకు వాహనాల్లో వెళ్లాలి. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర అత్యంత ప్రమాదకరమైన లోయల గుండా కాలినడకన ప్రయాణించాలి. వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. సాయంత్రం అయితే అడవిలో మనుషులు ఉండటానికి వీల్లేదు.
చెంచులే ఇక్కడ సుప్రీం!
ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ బ్రాహ్మణ పూజారులు ఉండరు. స్థానిక చెంచు ఆదివాసీలే తరతరాలుగా ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారు. లింగమయ్యను తమ ఇంటి దైవంగా భావించే చెంచులు, తమ సంప్రదాయ పద్ధతిలోనే పూజలు నిర్వహిస్తారు. ఆధునికతకు ఆమడ దూరంలో, కేవలం ప్రకృతి శక్తులను నమ్ముతూ సాగే ఈ పూజా విధానం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
కఠిన నిబంధనలు
నల్లమల టైగర్ రిజర్వ్ పరిధిలో ఈ ప్రాంతం ఉండటంతో అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. అడవిని శుభ్రంగా ఉంచడం కోసం ప్లాస్టిక్‌కు నోఎంట్రీ. అడవిలోకి ఒక్క ప్లాస్టిక్ కవరును కూడా అనుమతించరు. ఈ పరిసరాల్లో బీడీ, సిగరేట్ కాల్చడం పూర్తిగా నిషేధం. చిన్న నిప్పురవ్వ అడవిని దహించివేసే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. అంతేకాకుండా లోయలు చాలా ఇరుగ్గా ఉంటాయి కాబట్టి భక్తులు కర్రల సాయంతో చాలా జాగ్రత్తగా నడవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి, ఆధ్యాత్మికత, సాహసం మేళవించిన ఈ సలేశ్వరం జాతర 2026ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: ఆది కుంభేశ్వర ఆలయం: ఈ ఒక్క పని చేస్తే శత్రుజయం తథ్యం!
Follow Us On : WhatsApp

