కలం, వెబ్ డెస్క్: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా (Monalisa) అందరికీ సుపరిచితమే.. సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్‌తో ఈ పూసల పాప సెలబ్రెటీగా మారిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇటీవల సడెన్‌గా ప్రియుడు ఫర్మాన్ ఖాన్ (Farman Khan)తో ప్రేమ వివాహం చేసుకొని అందరికీ షాకిచ్చింది. కేరళలో పెళ్లి చేసుకొని మీడియా ముందుకొచ్చిన ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. మోనాలిసా మైనర్ అని, ఆమెకు పెళ్లి జరగడం చట్టరీత్యా నేరం అని ఆరోపణలు వచ్చాయి. దీంతో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) రంగంలోకి దిగింది. ఈ ఆరోపణలపై మోనాలిసా స్వస్థలం మధ్యప్రదేశ్ ఖర్‌గోన్‌లో విచారణ చేపట్టింది. ఈ విచారణలో మోనాలిసా మైనర్ అని తేలింది. కేరళలో ఫర్మాన్ ఖాన్‌తో వివాహం జరిగిన సమయంలో ఆమె వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ అని అధికారులు గుర్తించారు. పెళ్లి సమయంలో ఆమె సమర్పించిన ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ, ఆమె ధృవీకరణ పత్రాల్లోని పుట్టిన తేదీలో వ్యత్యాసాలు ఉండటంతో, ఈ ఉదంతంపై మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాపింగ్‌తో సహా పోక్సో (POCSO) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫర్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

