ఇజ్రాయెల్-హమాస్ మధ్య చాలా కాలంగా భీకర యుద్దం జరుగుతోంది. దీనిని ముగించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంలో అమెరికా కీలక ముందడుగు వేసింది. గాజా(Gaza)లో యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్(Israel), హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందానికి ఓకే చెప్పాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) పేర్కొన్నారు. అంతేకాకుండా తొలిదశ శాంతి ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు కూడా చేశాయని కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే తాజాగా ట్రంప్ ప్రకటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని మోదీ స్వాగతించారు.
కాగా, ఈ శాంతి ఒప్పందం ఇజ్రాయెట్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) బలమైన నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన సహాయం అందేలా చూడటంతో శాశ్వత శాంతికి బాటలు పడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదెలా ఉంటే ఈ తొలి దశ శాంతి ఒప్పందాన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవతా సహాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి జరిగిందని తెలిపింది.


