కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) నేటి నుంచి రెండు రోజుల పాటు ఫిలిప్పీన్స్ దేశంలో పర్యటించనున్నారు. నేడు, రేపు రాజధాని మనీలాలో జరిగే ఏషియన్ – ఇండియా, తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని పాల్గొనబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ సదస్సుకి హాజరు కానున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. మోదీ హాజరవుతున్న 13వ ఏషియన్ సదస్సు కావడం గమనార్హం. ఈ సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరు కానుండటంతో.. ఆయన్ను ప్రధాని కలుసుకునే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడి విందులో పాల్గొనడంతో పాటు అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు.
ఆ రెండింటిపైనే ప్రధాన చర్చ..
ఏషియన్ సదస్సు(ASEAN Summit)లో భాగంగా సముద్ర భద్రత, వాణిజ్యంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నౌకల రవాణా సాఫీగా జరగకపోవడంతో అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఘర్షణలు నివారించి, వాణిజ్య రవాణాల్లో ఆటంకాలు నిరోధించాలని గట్టిగా ప్రతిపాదించబోతుంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలనే డిక్లరేషన్ కూడా వెలువడనుంది. ఇక ఫిలిప్పీన్స్, భారత్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ రంగాల్లో పురోగతిపై ప్రధాని మోదీ (PM Modi) చర్చలు జరిపే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి తిరిగి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
Also Read : నేడు సోనియా గాంధీ పుస్తకం ఆవిష్కరణ
Follow Us On : WhatsApp

