కలం, ఖమ్మం బ్యూరో: రూ.180 కోట్ల వ్యయంతో తీగల వంతెనను పూర్తి చేసిన ప్రభుత్వం, ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీని ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) ప్రశ్నించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-TJF) ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జర్నలిస్టుల కోసం ఒకే చోట 23 ఎకరాల భూమిని కేటాయించి, క్యాబినెట్ ఆమోదంతో జీవో జారీ చేశామని గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, అప్పటి మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రత్యేక చొరవ తీసుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఆర్ గార్డెన్ వెనుక నుంచి వెంకటాయపాలెం వరకు 23 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని అన్నారు. రెవెన్యూ సర్వే, మార్కింగ్, ల్యాండ్ ఏలియనేషన్ పూర్తి చేసి జర్నలిస్టుల సొసైటీకి అప్పగించామని, లేఅవుట్లో రోడ్లు, వీధి దీపాల కోసం సుడా నుంచి రూ.2 కోట్లు కూడా మంజూరు చేశామని వివరించారు.
ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా 23 ఎకరాల భూమి ఇప్పటికీ జర్నలిస్టుల సొసైటీ పేరు మీదనే ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేస్తోందని పువ్వాడ మండిపడ్డారు. గతంలో కేటాయించిన భూమిలో 8 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా, చింతకాని సభల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమస్యపై స్పందించకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వాలు మారినా ప్రజలకు, జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు మారకూడదని పువ్వాడ అన్నారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లో సమస్య పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేస్తూ, వారి న్యాయమైన పోరాటానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్ అధ్యక్షులు చిర్రా రవి, నాయకులు ఆకుతోట ఆదినారాయణ, సాంబశివరావు, ప్రశాంత్, శ్రీనివాస్, ఖమర్, పగడాల నాగరాజు, పిన్ని కోటేశ్వరరావు, ఎండీ పాషా, దడాల రఘు తదితరులు పాల్గొన్నారు.

