కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ను తుఫానులు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇటీవలే అర్నబ్, మురసు తుఫానులతో అతలాకుతలం అయిన రాష్ట్రానికి మరో తుఫాను గండం పొంచి ఉంది. తాజాగా అక్వాన్ తుఫాను (Cyclone Akwan) ముంచుకొస్తుండడంతో ప్రజలు అటు అధికారులు భయాందోళన చెందుతున్నారు. ఈ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను తీరం దాటే సమయంలో సముద్రంలో భారీ ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. అక్వాన్ తుఫాన్ ఏ ప్రాంతంలో తీరం దాటుతుందనే విషయాన్ని ఇప్పుడే కచ్చితంగా అంచనా వేయలేమని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నం- ఒడిశాలోని గోపాల్ పూర్ మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని భావిస్తోంది. తుఫాను కదలికలు, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
అయితే, తుఫాను (Cyclone Akwan) తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు ఉప్పెన ప్రభావం ఉందన్న హెచ్చరికలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తుఫానుకు సంబంధించిన తాజా పరిస్థితులపై వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు ప్రజలను గమనించాలని అధికారులు కోరుతున్నారు. తుఫాను ప్రభావంతో ఈ నెల 20వ తేదీన రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

