కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టోలీ చౌకీలోని ఓ మండి రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి మండి కింగ్ రెస్టారెంట్ (Mandi King Restaurant) లో ఈ ఘటన జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో 2వ అంతస్తులోని హోటల్ కిచెన్ చిమ్నీలో మంటలు చెలరేగి.. 4, 5 వ అంతస్తుల వరకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకుంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 4, 5వ అంతస్తులో కస్టమర్లు భారీగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కస్టమర్లను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తరలించారు. గ్యాస్ సిలిండర్స్ ను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఘటనలో పక్కనే ఉన్న జునేరా రెస్టారెంట్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రెస్టారెంట్ (Mandi King Restaurant) యాజమాన్యం సహా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

