కలం, వెబ్ డెస్క్: భారత్ సమ్మిట్ (Bharat Summit)లో రెచ్చగొట్టే రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck)పై చర్యలు తీసుకోవాలని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో వరుస అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కాంగ్రెస్ తీవ్ర నిరాశలో ఉందని ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్ గాంధీని మళ్లీ రాజకీయంగా నిలబెట్టేందుకు విదేశీయుల సహాయం కోరుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
విదేశీయుల రాజకీయ జోక్యానికి భారత గడ్డను వేదికగా మార్చే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలపై విదేశీయుడు మాట్లాడటంపై చట్టరిత్యానేరమని.. ఈ నేరానికి పాల్పడ్డ కాంగ్రెస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భారత గడ్డపై నిలబడి, దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రక్రియలను బహిరంగంగా ప్రశ్నించే ఒక విదేశీ రాజకీయ నాయకుడు దుస్సాహసానికి పాల్పడ్డాడని మండిపడ్డారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నిరంతరం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం కాంగ్రెస్ నేర్చుకోవాలని హితవు పలికారు. ఒక విదేశీయుడు భారత ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తుంటే, రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడం ఎంత సిగ్గుచేటు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులుగా తేలిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదస్సు నిర్వాహకుల పాత్రపైనా లోతైన విచారణ జరపాలని కోరారు.

