కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కార్యాలయం (Seva Teerth) రెడీ అవుతోంది. న్యూ ఢిల్లీలోని రైసినా హిల్ సమీపంలో ప్రధాని క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ చివరిదశ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ప్రధాని కొత్త కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ ప్రాంగణాన్ని నిర్మాణ దశలో ‘ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్’గా పిలిచారు. అయితే అనంతరం దీనికి ‘సేవా తీర్థ్’ (Seva Teerth) అనే పేరు పెట్టారు. ఈ ప్రాంగణంలో మూడు ప్రధాన భవనాలు ఉన్నాయి. సేవా తీర్థ్–1లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఏర్పాటు చేశారు. సేవా తీర్థ్–2లో క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యాలయం ఉంది. సేవా తీర్థ్–3లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయం ఏర్పాటు చేశారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే నూతన పార్లమెంట్ భవనం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్ సిద్ధమయ్యాయి. ప్రధాని కార్యాలయం కూడా తుదిదశకు చేరుకుంది. అదేవిధంగా ప్రతిపాదిత ఎనిమిది కొత్త మంత్రిత్వశాఖ భవనాల్లో మూడింటి పనులు పూర్తయ్యి ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇదే ప్రాంగణానికి సమీపంలో ప్రధాని మోడీ (PM Modi) నివాసం కూడా నిర్మాణంలో ఉంది. అది పూర్తయ్యాక ప్రధాని అక్కడికి షిఫ్ట్ అవ్వనున్నారు.
సేవాతీర్థ్ ప్రత్యేకతలు ఏమిటి?
సేవా తీర్థ్‌లో ప్రముఖులు, విదేశీ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. వీటిని సాంకేతికంగా ఆధునికంగా నిర్మించడంతోపాటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. క్యాబినెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త హాల్‌ను రూపొందించారు. అలాగే ప్రధాని కార్యాలయంలో ఓపెన్ ఫ్లోర్ విధానాన్ని అమలు చేశారు. స్వాతంత్య్రం నుంచి ఇప్పటివరకు ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్‌లోనే కొనసాగుతోంది. అక్కడే విదేశాంగ, రక్షణ శాఖల కార్యాలయాలు కూడా ఉండేవి. నార్త్ బ్లాక్‌లో హోం, ఆర్థిక శాఖలు పనిచేశాయి. అయితే ఇప్పుడు ఆ శాఖలన్నింటినీ కర్తవ్యభవన్‌కు తరలించారు. బ్రిటిష్ కాలానికి చెందిన నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను ఇకపై భారతదేశ 5,000 ఏళ్ల నాగరికతను ప్రతిబింబించే భారీ మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం తొలి దశను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించే అవకాశం ఉంది.
Read Also: అహ్మదాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. పతంగులు ఎగరేసిన మోడీ!
Follow Us On: Pinterest


