కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ‘ఫాస్ట్-ట్రాక్ కోర్టుల’ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము చేపడుతున్న వరుస చర్యలలో ఇది మరొకటి అని స్పష్టం చేశారు. దేశ యువత భవిష్యత్తుకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సపోర్టర్స్ పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో వీరికి మద్దతుగా ప్రధాని నివాసం వద్దకు కాంగ్రెస్ నాయకత్వం ధర్నా చేపట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఆందోళనకారుల ఆగడాలకు కట్టడిచేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆందోళనకారులు సైతం పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం (NEET Paper Leak Protests) నెలకొంది. కాసేపటి తర్వాత పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
మళ్ళీ బుధవారం సాయంత్రం జంతర్ మంతర్ వద్ద భీకర వాతావరణాన్ని సృష్టించారు ఆందోళనకారులు. పోలీసులపైకి దాడికి దిగారు. పోలీసులు సీజేపీ సపోర్టర్స్ పై లాఠీ ఛార్జ్ తీవ్రతరం చేశారు. దీంతో జంతర్ మంతర్ వద్ద రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం సైతం నిరసనలు కొనసాగించేందుకు ఆందోళనకారులు వ్యూహాలు పన్నుతున్నారు. జంతర్‌మంతర్ వద్దకు సీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఆందోళన ఆగదని సీజేపీ సపోర్టర్స్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు కాపాడేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

