కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య (Constable Suicide)కు పాల్పడ్డారు. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఆయన వాష్ రూమ్‌లోకి వెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసుల విచారణలో ఘటనా స్థలంలో ఒక నోట్ బుక్ లభ్యమైంది. అందులో స్వామి రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తన మరణానికి ఎవరూ కారణం కాదని, ముఖ్యంగా తన భార్యాపిల్లలను ఏమీ అనవద్దని ఆయన అందులో పేర్కొన్నారు. వారు చాలా మంచివారని, తాను చనిపోయి దయ్యంగా మారినా సరే వారిని కాపాడుకుంటూ చూసుకుంటానని ఆ లేఖలో భావోద్వేగంగా రాశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. డీజీపీ కార్యాలయం లాంటి హై సెక్యూరిటీ జోన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.

