కలం, జోగులాంబ గద్వాల: ప్రజావాణికి (Prajavani) వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ (Jogulamba Gadwal Collector ) రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ వారం ప్రజావాణికి మొత్తం 34 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రజావాణిలో 98, మండల స్థాయి ప్రజావాణిలో 247 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వీటన్నింటినీ ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, చీఫ్ సెక్రటరీ స్థాయిలోనూ సమీక్ష జరుగుతున్నందున అధికారులు అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖకు సంబంధించి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పలు సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

