భద్రాద్రి ఎయిర్‌పోర్ట్.. స్థలాలు పరిశీలించిన ఏఏఐ

కలం, ఖమ్మం బ్యూరో : పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా శరవేగంగా పురోగమిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem Airport) జిల్లా గగనతల అనుసంధానానికి అడుగులు పడుతున్నాయి. ఎప్పటినుంచో కాగితాలకే పరిమితమైన విమానాశ్రయ ప్రతిపాదనలు ఇప్పుడు ఆచరణాత్మక రూపం దాలుస్తుండటంతో భద్రాద్రి జిల్లా టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం రెండు రోజుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం జిల్లాకు చేరుకోవడంతో ప్రాజెక్టు ఒక్కసారిగా వేగం పుంజుకుంది.

కేవలం ప్రాంతీయ విమానాలకే పరిమితం కాకుండా ఎయిర్‌బస్ A320, A321 వంటి భారీ విమానాలు దిగేలా 2,500 నుండి 2,700 మీటర్ల సుదీర్ఘమైన రన్‌వే నిర్మాణానికి అవసరమైన సాధ్యాసాధ్యాలపై ఏఏఐ టీమ్ ప్రధానంగా దృష్టి సారించింది. ​జిల్లా యంత్రాంగం అందించిన నివేదికల ఆధారంగా సుజాతానగర్ మండలంలోని సీతంపేట, సుజాతానగర్ తో పాటు దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని దమ్మపేట, మరియు చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలలో ఈ రన్‌వే ఏర్పాటుకు అనువైన భూములను బృందం నిశితంగా పరిశీలిస్తోంది.

భారీ ఎయిర్‌బస్ విమానాల రాకపోకలకు అనుగుణంగా రన్‌వే విస్తరణ సౌలభ్యం, భూమి లభ్యత, నైట్ ల్యాండింగ్ వ్యవస్థలు, విమానాల రాకపోకలకు అనువైన ‘అప్రోచ్ ఫన్నెల్'(విమానాలు దిగి లేచే మార్గం) సరిగ్గా ఉందా లేదా అన్న సాంకేతిక వివరాలను రికార్డులతో సరిపోల్చుతున్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్ నేతృత్వంలో సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో విమానాశ్రయ భవిష్యత్ అవసరాలపై సుదీర్ఘంగా చర్చించారు. ​

ఈ భారీ విమానాశ్రయ కల సాకారమైతే దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల రవాణా ఎంతో సులువవుతుంది. అంతేకాకుండా సింగరేణి, కేటీపీఎస్ వంటి భారీ పారిశ్రామిక సంస్థలకు విదేశీ పెట్టుబడులు, వ్యాపార ప్రతినిధుల రాకపోకలు పెరిగి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోనున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు కూడా ఇది ప్రధాన వైమానిక కేంద్రంగా మారనుంది.

​అయితే ఈ 2,700 మీటర్ల రన్‌వే నిర్మాణానికి సమీపంలోని విద్యుదీకరించిన బొగ్గు రవాణా రైల్వే లైన్ ప్రధాన సాంకేతిక సవాలుగా నిలిచింది. విమానాల ల్యాండింగ్ మార్గంలో ఉన్న ఈ లైన్ల వల్ల కలిగే విఘాతాలను అధిగమించడానికి ‘షీల్డింగ్’ విధానాన్ని అమలు చేయడంపై, రైల్వే శాఖ నుంచి ఎన్ ఓ సీ పొందే ప్రక్రియపై ఏఏఐ బృందం అధ్యయనం చేస్తోంది. రెండు రోజుల పరిశీలన అనంతరం ఏఏఐ సమర్పించే ‘టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్’ ఆధారంగానే విమానాశ్రయ తుది స్థలం ఖరారు కానుంది. ఈ సాంకేతిక సవాళ్లను దాటి రన్‌వే నిర్మాణం సాకారమైతే, భద్రాద్రి కొత్తగూడెం త్వరలోనే గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>