కలం, వెబ్డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో పొంగల్ వేడుక (PM Modi Pongal celebrations) ల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని మురుగన్ నివాసానికి సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ప్రధాని మోదీ పండగ సంబరాల్లో భాగమయ్యారు. సూర్య భగవానునికి పొంగళ్లు సమర్పించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ తమిళుల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు పొంగల్ ప్రతీక అన్నారు. దేశ పురోగతిలో భాగమైన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. తమిళులకు పొంగల్ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు. అంతకుముందు ‘ఎక్స్’ వేదికగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఈ పండుగ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం అందించాలని ఆకాంక్షించారు.
‘సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ తరుణంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వేర్వేరు పేర్లతో పండుగ జరుపుకునే ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం ప్రసాదించాలని ఆ సూర్య భగవానుని కోరుకుంటున్నాను.ఈ వేడుక మనందరి మధ్య ఐక్యత, బంధాలను మరింత పటిష్ఠం చేయాలని కోరుకుంటున్నాను ’ అని ప్రధాని మోదీ తన ట్వీట్ (PM Modi Pongal celebrations) లో పేర్కొన్నారు. ఇదే రోజు దేశంలోని చాలా ప్రాంతాల్లో లోహ్రి, మాఘ్ బిహు తదితర పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్న వాళ్లకూ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


