కలం వెబ్ డెస్క్ : తమ ప్లేయర్లు పార్టీ యానిమల్స్ కాదని, సరీస్‌లో ఉన్నప్పుడు మద్యం తాగడం వాళ్ల సాంప్రదాయం కాదంటూ ఇంగ్లండ్ ప్లేయర్లను వెనకేసుకొచ్చింది ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ECB). పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ వేదికలపై జరిగిన తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్(England) జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా కేవలం 11 రోజుల క్రికెట్(Cricket)కే సిరీస్ చేజారిపోయింది. సరైన సిద్ధత లేకపోవడం, అతిగా దూకుడుగా ఆడటం తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. మధ్యలో నూసాలో బీచ్ విరామం తీసుకోవడం, అక్కడ ఆటగాళ్లు మద్యం తాగుతున్న ఫొటోలు బయటకు రావడం వివాదాన్ని మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో బెన్ డకెట్(Ben Duckett) మత్తులో ఉన్నట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హోటల్‌కు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై మాజీ క్రికెటర్ స్టువార్ట్ బ్రాడ్ స్పందించారు. “ఇది మొత్తం జట్టు వైఖరిని చూపించదు. కేవలం ఇద్దరు ఆటగాళ్లు చేసిన తప్పులే పెద్ద విషయంగా మారాయి” అని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో సహచరులు ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. అదే నిజమైన జట్టు సంస్కృతి అని ఆయన అభిప్రాయం.
ఇంగ్లాండ్ జట్టులో మద్యం తాగే అలవాటు లేదని బ్రాడ్ తేల్చి చెప్పారు. జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి ఆటగాళ్లు పార్టీలు చేసుకునే వారు కాదని, కొద్దిమంది చేసిన పొరపాట్ల ఆధారంగా మొత్తం జట్టుపై ముద్ర వేయడం అన్యాయమని అన్నారు. వరుసగా నెలల తరబడి టూర్లలో ఉండే అంతర్జాతీయ ఆటగాళ్లకు కొంత మానసిక విశ్రాంతి అవసరమని బ్రాడ్ చెప్పారు. రిలాక్స్ అయ్యే అవకాశం లేకపోతే ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. గెలిచిన జట్టు కాస్త ఆనందంగా గడపడం సహజమని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


