కలం వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్(Thailand)లో ఘోర రైలుప్రమాదం చోటు చేసుకుంది. ఓ భారీ క్రేన్(crane) ప్రయాణిస్తున్న ఒక రైలు మీద పడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నఖాన్ రాచసిమా(Nakhon Ratchasima) ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉండగా సుమారు 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు దేశ రాజధాని బ్యాంకాక్(Bangkok) నుంచి ఉబోన్ రాచతాని జిల్లా వైపు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ భారీ క్రేన్లతో కార్మికులు పని చేస్తున్నారు. పనులు జరుగుతుండగానే క్రేన్ కుప్పకూలింది. దీంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలు క్షతగాత్రుల సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.


