ప్రధాని ‘పొదుపు’ బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు

కలం, తెలంగాణ బ్యూరో : దేశంలో పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ఒత్తిడి, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన “ఇంధన పొదుపు” (Fuel Saving Drive) పిలుపు దేశవ్యాప్తంగా పాలకవర్గాల పనితీరునే మార్చేస్తున్నది. ప్రధాని కాన్వాయ్‌ మొదలు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రయాణాల దాకా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కాన్వాయ్‌లలో కార్ల సంఖ్య తగ్గుతున్నది. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మంత్రులే స్వచ్ఛందంగా ఎస్కార్ట్, పైలట్ వాహనాలను వదులుకుంటున్నారు. ప్రధాని కాన్వాయ్‌లో రెగ్యులర్‌గా ఉండే 15 కార్లకు బదులు రెండే ఉన్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సింగిల్ కారులోనే ఆఫీసుకు వెళ్ళారు. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి ద్వారకాధీశ్ సైకిల్‌పై కోర్టుకు వెళ్తే ఢిల్లీ మంత్రి కపిల్ శర్మ మెట్రో ట్రెయిన్‌లో వెళ్లారు. కాన్వాయ్‌లలో ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు పాటించడానికి ముందు ప్రధాని నుంచి రాష్ట్ర మంత్రుల వరకు స్వచ్ఛందంగా ‘పొదుపు’ (Fuel Saving Drive) సూత్రాన్ని పాటిస్తున్నారు.

రెండు కార్లతోనే ఇంటి నుంచి ఆఫీసుకు ప్రధాని :

ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించుకున్నారు. దేశమంతా పాటించాలంటే తానే ఆదర్శంగా ఉండాలని ఈ ప్రాక్టీస్ ద్వారా మెసేజ్ ఇచ్చారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో 15 వాహనాలుంటాయి. బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు, జామర్‌ వాహనాలు, డెకాయ్‌ కార్లు, అంబులెన్స్‌, భద్రతా వాహనాలు కలిసి భారీ కాన్వాయ్‌ ఉంటుంది. కానీ బుధవారం కేవలం రెండు వాహనాలతోనే ప్రయాణించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ (ఎస్పీజీ) కాన్వాయ్‌ సైజ్‌ను కూడా 50% తగ్గించాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కొత్త వాహనాల కొనుగోళ్లు లేకుండా సాధ్యమైన చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచించారు. ప్రధాని నిర్ణయం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌‌నాధ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అధికారులు కార్‌పూలింగ్‌, మెట్రో ప్రయాణాలు, వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశాలపై చర్చిస్తున్నారు.

బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో పొదుపు చర్యలు :

బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మంత్రుల కాన్వాయ్‌లు, భద్రతా సిబ్బంది వాహనాల వినియోగంలో 50% కోత పడింది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాధ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సీఎం సహా మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాలను 50% తగ్గించాలని ఆదేశించారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ఉపయోగించాలని చెప్పారు. కార్‌పూలింగ్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌, వర్చువల్‌ మీటింగ్స్‌, సైక్లింగ్‌, ఈవీల వినియోగం గురించి వివరించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోనూ ఇలాంటి ఆదేశాలే అమలవుతున్నాయి. మంత్రులు, అధికారులు అవసరంలేని వాహనాలను కాన్వాయ్‌లో తగ్గించాలని, విదేశీ ప్రయాణానికి, ప్రభుత్వ విమాన వినియోగానికి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఆదేశించారు. గుజరాత్‌ గవర్నర్‌ బస్సుల్లో ప్రయాణించారు. హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల బదులు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తానని ప్రకటించడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>