కలం, ఖమ్మం బ్యూరో : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం ఆయన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక అర్చనలో పాల్గొన్న ఆయన, తన నాలుగు దశాబ్దాల ప్రజాసేవకు దైవానుగ్రహం లభించిందని భావిస్తూ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. వేద పండితులు ఆశీర్వచనం అందించి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు సమర్పించారు.
1986 మే 14న ప్రారంభమైన తుమ్మల రాజకీయ ప్రస్థానం.. మంత్రి పదవితో కొత్త మలుపు తిరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో తొలిసారి ఆయనకు అవకాశం లభించింది. అనంతరం నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇలా నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో అత్యంత కీలకమైన శాఖలను నిర్వర్తించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తుమ్మల (Minister Tummala) ప్రత్యేక ముద్ర వేశారు. ముక్కుసూటి వైఖరి, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల పాటు మంత్రి హోదాలో కొనసాగడం అరుదైన ఘనతగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Follow Us On: Instagram

