కలం డెస్క్: IPL 2026 వేలానికి(IPL Auction) ముహూర్తం ఖరారయింది. అబుదాబి వేదికగా డిసెంబర్ 16న ఈ వేలం జరగనుంది. ఇందులో మొత్తం 1,390 మంది ఆటగాళ్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. ఫ్రాంచైజీలతో సంప్రదింపుల అనంతరం బీసీసీఐ ఈ జాబితాను 350 మందికి కుదించింది. 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 77 స్థానాలను మాత్రమే భర్తీ చేయనుండగా, వాటిలో 31 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడ్డాయి.
ఈ వేలంలో కూడా గరిష్ట బేస్ ప్రైస్‌గా రూ.2 కోట్లు నిర్ణయించగా, 40 మంది ఆటగాళ్లు ఈ కేటగిరీలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే భారీ అనుభవం, పేరు ఉన్నప్పటికీ… ప్రస్తుత టీ20 అవసరాలు, ఫామ్, లభ్యత వంటి కారణాల వల్ల కొంతమంది ప్రముఖులు ఈసారి కొనుగోలు దారులు దొరకని పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఐపీఎల్‌లో వెయ్యి పైచిలుకు పరుగులు, పదేళ్లకు పైగా అనుభవం ఉన్న స్టీవ్ స్మిత్ పేరు ఈసారి కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్ కేటగిరీలో ఉంది. అయితే 2021 తర్వాత ఐపీఎల్‌లో కనిపించకపోవడం, టీ20ల్లో అవసరమైన వేగవంతమైన బ్యాటింగ్‌కు అతడి ఆట శైలి పూర్తిగా సరిపోకపోవడం అతనికి ప్రతికూలంగా మారుతోంది. ప్రస్తుతం టీ20ల్లో 150కి పైగా స్ట్రైక్‌రేట్‌ను ఫ్రాంచైజీలు కోరుకుంటున్న నేపథ్యంలో, స్మిత్‌పై ఆసక్తి చూపే జట్లు తక్కువగానే ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
జేసన్ హోల్డర్ (వెస్టిండీస్)
ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో(IPL Auction) భారీ ధర పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. 2022, 2023 సీజన్లలో వరుసగా అవకాశాలు దక్కినా, స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో అధిక ఎకానమీ రేటు ఫ్రాంచైజీలను ఆలోచనలో పడేసింది. దీంతో గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌కు దూరమైన హోల్డర్ ఈసారి కూడా కొనుగోలు దారులు దొరకకపోవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
టామ్ బాంటన్ (ఇంగ్లండ్)
ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ టామ్ బాంటన్ పేరు ఒకప్పుడు టీ20 సర్క్యూట్‌లో సంచలనం సృష్టించింది. ఆ క్రమంలోనే ఐపీఎల్‌లో అవకాశం దక్కినా, దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్‌కు దూరమైన బాంటన్… ఇతర లీగ్‌ల్లోనూ నిలకడగా రాణించలేకపోవడం అతడి అవకాశాలను తగ్గిస్తోంది. ఈసారి ₹2 కోట్ల బేస్ ప్రైస్‌తో మళ్లీ వేలంలోకి వచ్చినా, ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపుతాయా అన్నది అనుమానంగానే ఉంది.
మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్)
అనుభవం ఉన్న పేసర్‌గా పేరున్న న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీకి ఐపీఎల్‌లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కెరీర్‌లో అనేక టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఐపీఎల్‌లో అతడు ఆడిన మ్యాచ్‌లు చాలా తక్కువ. గాయాల భయం, ఫిట్‌నెస్ అంశాలు ఫ్రాంచైజీలను వెనుకాడేలా చేస్తున్నాయి. అందుకే ₹2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఉన్నప్పటికీ, హెన్రీకి ఈసారి కొనుగోలు దారులు దొరకడం కష్టమేనని భావిస్తున్నారు.
జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)
గత సీజన్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ జోష్ ఇంగ్లిస్… ఈసారి లభ్యత సమస్యను ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల 2026 ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో, ఫ్రాంచైజీలు అతనిపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడవచ్చు. పూర్తి సీజన్ అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో జట్లు సాధారణంగా రిస్క్ తీసుకోవడం తక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: X(Twitter)


