కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక (Pinapaka) నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసి వినతి పత్రం అందించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను వివరించి, వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఎండాకాలం తాగు నీటి సమస్య నియోజకవర్గ ప్రజలను వేధిస్తోందని, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాత రహదారులకు మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే పోడు భూముల సమస్యలను పరిష్కరించి అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు సిబ్బంది, పరికరాల కొరత ఉందన్నారు. మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి మణుగూరులో విద్యా సంస్థల బలోపేతానికి నిధులు కేటాయించాలని కోరారు.

