కలం, వెబ్ డెస్క్ : సంపద అంటే అదృష్టం, భారీ జీతం లేదా షార్ట్‌కట్‌ల ద్వారానే వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి క్రమశిక్షణతో (Personal Finance) కూడిన ఆర్థిక అలవాట్లే సంపదకు అసలు పునాది అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన ప్రణాళికతో మధ్యతరగతి వ్యక్తి కూడా 20 ఏళ్లలో కోట్ల రూపాయల సంపదను నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణుడు నితిన్ కౌశిక్ సూచించిన విధానాన్ని ఇప్పుడు దశలవారీగా చూద్దాం.
స్టెప్ 1: ఆదాయంలో 15% పెట్టుబడి
మీ నెలవారీ ఆదాయంలో కనీసం 15 శాతం తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి. ఖర్చులు చేసిన తర్వాత మిగిలితే పెట్టుబడి పెట్టడం కాకుండా, ముందుగా పెట్టుబడి చేసి మిగిలిన డబ్బుతో జీవనం సాగించాలి. ఈ పెట్టుబడిని తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్లలో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPలు) ద్వారా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో వీటికి సగటున 12 నుంచి 15 శాతం వరకు రాబడి లభించే అవకాశం ఉంటుంది.
స్టెప్ 2: పవర్ ఆఫ్ కాంపౌండింగ్‌కు ఓపిక ఇవ్వాలి
ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే వడ్డీపై వడ్డీ ప్రభావం ప్రారంభమవుతుంది. మొదటి కొన్ని సంవత్సరాల్లో వృద్ధి నెమ్మదిగా కనిపించినా, 10–15 ఏళ్ల తర్వాత సంపద వేగంగా పెరుగుతుంది. ఈ ఓపికే మధ్యతరగతి వ్యక్తిని కోటీశ్వరుడిగా మార్చే కీలక అంశం.
స్టెప్ 3: మిగిలిన 85% లోనే జీవనశైలి
మీ ఆదాయంలో మిగిలిన 85 శాతం డబ్బుతోనే జీవనశైలిని నిర్మించుకోవాలి. జీతం పెరిగిన ప్రతిసారీ ఖర్చులు పెంచే ‘లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్’ అలవాటుకు దూరంగా ఉండాలి. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించడం ఆర్థిక స్థిరత్వానికి అత్యంత అవసరం.
స్టెప్ 4: అధిక వడ్డీ అప్పులకు నో చెప్పాలి
అనవసరమైన EMIలు, క్రెడిట్ కార్డుల అధిక వినియోగం, ‘ఇప్పుడే కొనాలి’ అనే ఆలోచన సంపదను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కరిగిస్తుంది. అధిక వడ్డీ రేట్లు మీ ఆదాయంలో పెద్ద భాగాన్ని తీసుకుపోతాయి. అప్పుల నుంచి దూరంగా ఉండటమే సంపద నిర్మాణంలో మొదటి విజయం.
స్టెప్ 5: మార్కెట్ ఒడిదుడుకులను భయపడవద్దు
మార్కెట్ హెచ్చుతగ్గులు సహజం. వాటిని చూసి పెట్టుబడులను ఆపేయడం లేదా మధ్యలో విత్‌డ్రా చేయడం పెద్ద తప్పు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రతి నెలా పెట్టుబడి కొనసాగిస్తే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి.
ముఖ్యమైన విషయం..
సంపద విషయంలో సంఖ్యల కంటే మీ ఆర్థిక ప్రవర్తనే కీలకం. క్రమశిక్షణ, ఓపిక, ఖర్చులపై నియంత్రణ.. ఈ మూడు ఉంటే మధ్యతరగతి వ్యక్తికి కోట్ల సంపద (Personal Finance) సాధ్యమే. అందుకే, కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? అనే ప్రశ్నకు సమాధానం షార్ట్‌కట్‌లలో కాదు, మీ రోజువారీ ఆర్థిక అలవాట్లలోనే ఉంది అని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
Read Also: నీ కాళ్లు మొక్కుతా వదిలేయండి సార్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
Follow Us On : WhatsApp


