కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన యువకుడు శవమై తేలడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జాల వంశీ (29) అనే దళిత యువకుడు ఇటీవల అదృశ్యమయ్యాడు. దీనిపై వంశీ తల్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కొనసాగుతుండగానే ఆదివారం మంథని మండలం గాడిదలగండి వద్ద వంశీ మృతదేహం లభ్యమైంది.
దీంతో ఈ మిస్సింగ్ కేసు కాస్తా హత్య కేసుగా మారింది. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు సీడీఆర్, కాల్ డేటా ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి కథనం ప్రకారం.. వంశీ, అలేఖ్య అనే యువతి పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. అయితే అలేఖ్య నీలం నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా వంశీ అలేఖ్యను వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఆమె ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. ఈ వేధింపులు భరించలేక అలేఖ్య, ఆమె భర్త నీలం నవీన్, బుర్ర భాస్కర్ కలిసి వంశీని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత కక్షలు, వేధింపులే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

