కలం, ఖమ్మం బ్యూరో: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా చేసుకుని, సరిహద్దు దాటించి తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న అంతరాష్ట్ర ఇసుక ముఠా గుట్టును సత్తుపల్లి (Sathupalli) పోలీసులు రట్టు చేశారు. ఈ అక్రమ దందాలో ప్రధాన సూత్రధారిగా ఉన్న బేతుపల్లి గ్రామానికి చెందిన గద్దల శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బేతుపల్లికి చెందిన గద్దల శ్రీను తన సోదరుడు శివ, డ్రైవర్లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఏపీలోని కొవ్వూరు గోదావరి ఇసుక ర్యాంప్ నుండి ఉచిత ఇసుకను లోడ్ చేసుకుని, తనకున్న లారీల ద్వారా తెలంగాణలోని సత్తుపల్లి పరిసర ప్రాంతాలకు దారి మళ్లించేవాడు.
తెలంగాణ మైనింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడనే పక్కా సమాచారంతో, గత నెల 21వ తేదీన ఏపీ-39-టియు-7377 నంబర్ గల లారీలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా, పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు శివ పట్టుబడగా ప్రధాన నిందితుడు గద్దల శ్రీను, డ్రైవర్ నాగేంద్రబాబు కారులో తప్పించుకున్నారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఇన్స్‌పెక్టర్ శ్రీహరి పర్యవేక్షణలో ఎస్ఐ ప్రదీప్ బృందం విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టింది. ఆటో నగర్ సమీపంలోని ఒక లాడ్జిలో తలదాచుకున్న శ్రీనును పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి క్రెటా కారును (TS-04-EK-9339) సీజ్ చేశారు.
8 నెలల్లో 6 కేసులు..
నిందితుడు శ్రీను గడిచిన ఎనిమిది నెలల కాలంలోనే వివిధ లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించినందుకు ఇతనిపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పదేపదే నేరాలకు పాల్పడుతుండటంతో ఇతనిపై చీటింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి సోమవారం సత్తుపల్లి సబ్ జైలుకు తరలించామని సత్తుపల్లి సీఐ శ్రీహరి వివరించారు.

