కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ప్రస్తుతం ఖజానాను నింపుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే బకాయిల వసూలును స్టార్ట్ చేసింది. బోర్డుకు రావాల్సిన బిలియన్ల రూపాయల బకాయిలను ఎలాగైనా వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికయినా వెనకాడకూడదని బోర్డ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించని ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్ట్ భాగస్వాములు, ఇతర వ్యాపార సంస్థలకు తాజాగా లీగల్ నోటీసులు పంపింది. నిర్ణీత సమయంలోగా డబ్బులు కట్టకపోతే ఒప్పందాలను రద్దు చేస్తామని పీసీబీ హెచ్చరించింది.
గతంలో పీఎస్‌ఎల్ (PSL) కు చెందిన కొన్ని ఫ్రాంచైజీలు వార్షిక ఫీజులు చెల్లించడంలో ఆలస్యం చేశాయి. బోర్డు నోటీసులతో అవి ఇప్పుడు బకాయిలు క్లియర్ చేశాయి. అయితే, 2010 నుంచి సెంట్రల్ పూల్ ద్వారా తమకు అందాల్సిన వాటాను కూడా విడుదల చేయాలని ఫ్రాంచైజీలు బోర్డును కోరుతున్నాయి.
మరోవైపు పీఎస్‌ఎల్ 10వ సీజన్‌కు సంబంధించి సుమారు 96 కోట్ల రూపాయల వాటా తమకు అందలేదని, అందుకే ఫీజులు ఆలస్యమయ్యాయని ఒక ఫ్రాంచైజీ వాదించింది. దీనిపై బోర్డు స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారం పార్టీలు తమ బాధ్యతలను నెరవేర్చకుంటే, బోర్డు బకాయిలను ఎలా చెల్లిస్తుందని సూటిగా ప్రశ్నించింది. 2025 సీజన్‌కు సంబంధించి ఇప్పటికీ ఫ్రాంచైజీలకు 40 నుండి 45 కోట్ల రూపాయల వరకు బోర్డు బకాయి పడి ఉంది. పీసీబీకి అత్యధికంగా బాకీ పడింది ఒక మీడియా హక్కుల సంస్థ. పీఎస్‌ఎల్, అంతర్జాతీయ క్రికెట్ ప్రసార హక్కులను పొందిన ఈ సంస్థ, భారీ నష్టాలు వచ్చాయని చెబుతూ సుమారు 450 కోట్ల రూపాయలను (4.5 బిలియన్ పీకేఆర్) ఇంకా చెల్లించలేదు. దీనివల్ల బోర్డు ఆర్థిక రికార్డులను అప్ డేట్ చేయడం, ఆడిటింగ్ నిర్వహించడం కష్టంగా మారింది.
ఇక కొత్త ఫ్రాంచైజీల విషయానికి వస్తే.. ముల్తాన్ సుల్తాన్స్ కొత్త యజమానులు, మిగిలిన రెండు కొత్త టీమ్స్ పీఎస్‌ఎల్ 11 ప్రారంభానికి ముందే తమ ఫీజులను చెల్లించాయి. అయితే వీరికి పీఎస్‌ఎల్ 11, ఆ తర్వాతి నాలుగు సీజన్ల కోసం సెంట్రల్ పూల్ నుండి కనీసం 85 కోట్ల రూపాయలను బోర్డు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పీఎస్‌ఎల్ ప్రసార హక్కులను పొందిన ఒక కొత్త సంస్థ, పాత బకాయిదారుడికే తిరిగి ఆ హక్కులను సబ్-లెట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం పీసీబీ (PCB) ఈ ఆర్థిక సమస్యలను పరిష్కరించి, లెక్కలను సరిచేసే దిశగా అడుగులు వేస్తోంది.
Read Also: తమిళనాడు ప్రభుత్వంపై సస్పెన్స్.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం..?
Follow Us On: WhatsApp

