కలం, వెబ్ డెస్క్: ఆర్చరీ వరల్డ్ కప్ (Archery World Cup) స్టేజ్-2లో పతకాల వేటలో ఉన్న భారత కాంపౌండ్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోలేక మన ఆర్చర్లు పతకం లేకుండానే వెనుదిరిగారు. గత నెలలో స్వర్ణం గెలిచిన జ్యోతి సురేఖ, ప్రగతి, అదితి స్వామిల మహిళల జట్టు.. ఈసారి క్వార్టర్ ఫైనల్స్‌లోనే టర్కీ చేతిలో 227-233తో ఓడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పురుషుల జట్టు కూడా సెమీస్ వరకు వెళ్లి నిరాశపరిచింది. కాంస్య పతక పోరులో చైనాతో జరిగిన మ్యాచ్ షూట్-ఆఫ్ వరకు వెళ్ళింది. ఇద్దరూ సమానంగా రాణించినా, చైనా బాణాలు లక్ష్యానికి చేరువగా ఉండటంతో భారత్‌కు కాంస్యం చేజారింది.
అంతకుముందు సెమీస్‌లో అమెరికాతో జరిగిన పోరులోనూ ఆఖరి నిమిషం వరకు ఆధిక్యంలో ఉన్న భారత్, చివరి ఆరు బాణాల్లో తడబడి కేవలం ఒక పాయింట్ తేడాతో విజయాన్ని కోల్పోయింది. ఆసియా క్రీడలకు ముందు ఇలాంటి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తిస్థాయి కోచ్ లేకపోవడం, సరైన ప్రణాళిక లోపించడం మన ఆటగాళ్లపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మిక్స్డ్ టీమ్ విభాగంలో ఓజాస్, అదితి మాత్రమే భారత్ ఆశలుగా మిగిలారు.

