కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా.. ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నామని ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. అటు వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారని ఫైర్ అయ్యారు. రాజధాని సమస్యను పరిష్కరించకపోగా.. కఠినం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని.. వచ్చినా ఏం చేయలేదని చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతి చట్టబద్దతపై తీర్మానం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి (Amaravati) మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan).. అమరావతి రైతుల కోసం మనమంతా ఒకే మాటపై ఉండాలని సభ్యులను ఉద్దేశించి అన్నారు. అమరావతిపై జనసేన (Janasena) ఎప్పుడూ మాట మార్చదని వెల్లడించారు . అటు తనకు తెలంగాణ వేరు.. ఏపీ వేరు అనే భావన లేదన్నారు. తెలుగునేల అనేదొక్కటే తన భావన అని చెప్పారు. అయితే ఏపీ నేలపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీతో కలిశామని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.
Read Also: స్వంతంత్ర భారత్‌లో అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతులదే: మంత్రి అనిత
Follow Us On : WhatsApp

