కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో జారీ అయిన మైనింగ్ లీజులు, లైసెన్సులపై సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని మైనింగ్ లీజులపైనా, చోటుచేసుకున్న అవకతవకలపైనా సీబీసీఐడీ దర్యాప్తుకు ఆయన ఆదేశించారు. వీలైనంత తొందరగా నివేదిక తెప్పించుకుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే సభలో టేబుల్ చేసి ఉల్లంఘనలకు పాల్పడినవారిపై తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సోదరుడు మహేశ్‌రావు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు, ఆయన తండ్రి రవీందర్‌రావు తదితరులకు, వారి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల మైనింగ్ లీజులు, అక్రమాలపై (Telangana Mining Scams) ఈ దర్యాప్తు ఉంటుందన్నారు.
పైరవీకి లొంగనందునే మంత్రి పొంగులేటిపై ఆరోపణలు :
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ లీడర్లు ఒత్తిడి తెచ్చారని, పైరవీలకు ఆయన తలొగ్గక పోవడంతో ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ ప్రయత్నాలకు ప్రభుత్వం లొంగదని, ఒత్తిడులకు భయపడదన్నారు. నిజానికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించిందే మైనింగ్ డిపార్టుమెంటు అధికారులని గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆ కంపెనీకి రంగారెడ్డి జిల్లా మైనింగ్ డిపార్టుమెంటు అసిస్టెంట్ డైరెక్టర్ నోటీసు ఇచ్చారని, చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారని సీఎం గుర్తుచేశారు. చివరకు సీనరేజ్ చార్జీల కింద ప్రభుత్వానికి రావాల్సిన రూ. 1.52 కోట్లు, పర్మిట్ ఫీజు కింద రూ. 1.22 కోట్లను వసూలు చేసిందన్నారు. ఈ అవకతవకలను డిపార్టుమెంటు అధికారులు గుర్తించారే తప్ప బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
పన్ను వసూళ్ళలో రాజీ ప్రసక్త లేదు : సీఎం
బీఆర్ఎస్ నేతలు పైరవీలకు మంత్రి పొంగులేటి (Minister Ponguleti) లొంగనందునే ఇప్పుడు ఆయనకు ఆరోపణలను ఆపాదిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు సభలో ఈ ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు సొంతంగా కనిపెట్టిన అవినీతి, అవకతవకలు ఏవీ లేవని, డిపార్టుమెంటు వెలికితీసిందేనని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు వివాదాన్ని లేవనెత్తుతున్నాయని, మంత్రి మీద బురద జల్లుతున్నాయన్నారు. అనుకున్న పైరవీలకు మంత్రి సహకరించడంలేనందునే ఒత్తిడి చేస్తున్నదని, బ్లాక్ మెయిల్ చేసి పనులు చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రయత్నాలకు ప్రభుత్వం లొంగదని, భయపడదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటివి కుదరదన్నారు. నిజంగా మంత్రికి ప్రమేయం ఉంటే ప్రభుత్వం నోటీసులు ఇస్తుందా?.. పన్ను వసూలు చేస్తుందా?.. అని సీఎం ఎదురు ప్రశ్నించారు.
విపక్షాల డిమాండ్ ప్రకారం సీబీసీఐడీ దర్యాప్తు :
మైనింగ్ అవకతవకలపై విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నందున ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో సిరిసిల్లలోని నేరెళ్లలో దళితులను లారీ ఎక్కించి చంపిన ఘటనపైనా, అక్రమ ఇసుక రవాణా చేసిన మాజీ ఎంపీ సంతోష్‌రావు, ఆయన తండ్రి రవీందర్ రావుకు సంబంధించిన మాఫియా మీద విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. శిరీష జీయో గ్రానైట్స్ కంపెనీకి సంబంధించి ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ లీజు రాయించుకుని అక్రమ మైనింగ్ చేయించిన వ్యవహారంపైనా దర్యాప్తు జరిపిస్తామన్నారు. మిడ్ వెస్ట్ గ్రానైట్స్ విషయంలో మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించిన హరీశ్‌రావు, ఆయన సోదరుడు మహేశ్‌రావు మీద, ఇల్లీగల్ మైనింగ్ (Telangana Mining Scams) చేయించుకున్న ఘటనపైనా దర్యాప్తు చేయిస్తామన్నారు.
గంగుల కమలాకర్, వద్దిరాజు వ్యవహారాల్లోనూ.. :
గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శ్వేత గ్రానైట్స్ (Swetha Granites) విషయంలో అవకతవకలపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు జరుగుతున్నదని, దానిపైనా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన గాయత్రి గ్రానైట్స్ నోటీసులు ఇచ్చి, పెనాల్టీలు వేసి ఆర్బిట్రేషన్‌లో తగ్గించుకున్న విషయంపైనా దర్యాప్తు చేయిస్తామన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పైన కూడా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ ఆదాయానికి గండికొట్టిన బీఆర్ఎస్ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం పెరిగిందని, దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారని, గత ప్రభుత్వంలో ఆదాయాన్ని దిగమింగారన్న ఆరోపణలు వస్తాయన్న ఆందోళనతో మంత్రిపై బీఆర్ఎస్ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం గుర్తుచేశారు. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ దెబ్బతిన్నదని చెప్తూనే ఇసుక అక్రమ రవాణా అంటూ బీఆర్ఎస్ నేతలు పాట పాడుతున్నారని, ఇవి దెబ్బతింటే ఇసుక ఆదాయం ఎలా పెరుగుతుందని సీఎం ప్రశ్నించారు.
Read Also: మందుబాబులకు సమ్మర్ షాక్.. లిక్కర్, బీర్ ధరలు హైక్ !
Follow Us On: Instagram

