కలం, వెబ్ డెస్క్: ఏపీలో మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేశామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు.
1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి..
గత వైసీపీ ప్రభుత్వం మత్సకారులకు (Fishermen Welfare) రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తుందన్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోందని చెప్పారు. కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్ల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని వివరించారు.
వలసలు తగ్గించే దిశగా అడుగులు..
మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని చెప్పారు. 4,578 బోట్లకుగాను 91.48 లక్షల లీటర్ల డీజిల్‌పై ప్రభుత్వం రూ.8.23 కోట్ల రూపాయల సబ్సిడీని అందించిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.1.13 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామన్నారు.
ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది..
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 100 శాతం సబ్సిడీపై ట్రాన్స్ పాండర్స్ ఇస్తోందన్నారు. సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 స్థలాలను ఎంపిక చేశామని చెప్పారు. ఒక్కో చోట రూ. 20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రీప్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని వివరించారు.

