కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ వేదికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య కనిపించే ఫ్రెండ్ షిప్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీలో ఉన్న పీఎం మోదీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ ఎంతో పాపులర్ అయిన పార్లే ‘మెలోడీ’ (Parle Melody) చాక్లెట్ ప్యాకెట్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇంటర్‌నెట్‌లో వీరిద్దరి పేర్లను కలిపి నెటిజన్లు పిలుచుకునే ‘మెలోడీ’ హ్యాష్‌ట్యాగ్‌ను గుర్తు చేసేలా మోదీ ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. మెలోనీకి చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి మెలోనీ స్పందిస్తూ.. ‘‘గిఫ్ట్‌కు ధన్యవాదాలు’’అని కామెంట్ చేశారు. ఈ వీడియోల సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు మెలోనీ కూడా ఫిదా అయిపోయారు.
#Melodi హ్యాష్ ట్యాగ్ వైరల్
జార్జియా మెలోని నవ్వుతూ.. ‘‘ఇండియా ప్రధానమంత్రి మోదీ నా కోసం చాలా చాలా మంచి టాఫీని బహుమతిగా తెచ్చారు’’ అని చెప్పగా.. మోదీ స్పందిస్తూ.. ‘‘మెలోడీ’’ అని అనడం కనిపిస్తుంది. ‘వెరీ.. వెరీ.. చాక్లెటీ’ అనే ట్యాగ్‌లైన్‌తో భారతీయుల మనసు దోచుకున్న ఈ చాక్లెట్ ప్యాకెట్‌ను పట్టుకుని ప్రపంచ దేశాలను శాసిస్తున్న ఇద్దరు అగ్ర నేతలు సరదాగా నవ్వుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. దీంతో నెట్టింట #Melodi హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా “Melodi” అనే పదాన్ని సరదాగా “Melody” చాక్లెట్‌తో ముడిపెట్టి నెటిజన్లు రీ పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియో బయటికొచ్చిన గంటల్లోనే కోట్లాది వ్యూస్.. లక్షల కొద్దీ లైక్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది.
పార్లే ఇండస్ట్రీస్ షేర్ 5శాతం అప్పర్ సర్క్యూట్
మెలోనీకి మోదీ గిఫ్ట్ పార్లే మెలోడీ టోఫీ ప్యాకెట్ గిఫ్ట్ ఇవ్వగా.. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అనూహ్యంగా స్పందించారు. ఈ మెలోనీ రీల్ వైరల్ అయిన కొద్దిసేపటికే పార్లే సంస్థ షేర్ ధర పైకి ఎగబాకింది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో పార్లే ఇండస్ట్రీస్‌కు చెందిన 8 లక్షల షేర్లు చేతులు మారాయి. మామూలుగా ఒక వారంలో సగటున 2 లక్షల షేర్లు, నెలలో సగటున 3 లక్షలు షేర్ల కొనుగోలో లేక అమ్మకమో జరుగుతుంటుంది. ‘మెలోడీ’ ట్రేడింగ్‌తో పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సంస్థ పార్లే ఇండస్ట్రీస్.. బీఎస్‌ఈలో లిస్ట్ అయింది. రీసైక్లింగ్ విభాగంలోనూ ఇది కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. అయితే, దీనికి మెలోడీ చాక్లెట్లకు ఎలాంటి సంబంధం లేదు.
ఇన్ స్టాలో స్పందించిన పార్లే జీ సంస్థ
మెలోడీ చాక్లెట్లను పార్లే ప్రొడక్ట్స్ సంస్థ తయారుచేస్తున్నది. పార్లే-జీ, మొనాకో, హైడ్ అండ్ సీక్, మాంగోబైట్.. ఈ సంస్థ బ్రాండ్లే. మెలోడీ చాక్లెట్లపై జార్జియా మెలోనీ వీడియో షేర్ చేయగానే పార్లే-జీ సంస్థ స్పందించింది. ‘‘1983 నుంచి దేశాల మధ్య సంబంధాలను మధురంగా మారుస్తున్నాం’’ అంటూ ఇన్‌స్టాలో ఆ వీడియోను షేర్ చేసింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ.. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాలేదు. బుధవారం మెలోడీ మూమెంట్ వైరల్ అయిన తర్వాత పార్లే పేరు విషయంలో ఇన్వెస్టర్లు ఒకింత గందరగోళానికి గురైనట్లు కనిపిస్తున్నది.

