కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అంజన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన మలుపులకు వేదికైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.
తనలో ఇంతటి ధైర్యం, పోరాట పటిమ, చైతన్యం రావడానికి తెలంగాణ నేలే కారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటనను గుర్తుచేసుకుంటూ, కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించారని చెప్పారు. ఈ గడ్డ మీద పెరిగిన చైతన్యం వల్లే తాను సామాజిక అంశాలపై పోరాడగలుగుతున్నానని ఆయన వివరించారు. ఈ రాష్ట్రం నుంచి తాను వ్యక్తిగతంగా ఏదీ ఆశించడం లేదని, కేవలం ఇక్కడి ప్రజల సంక్షేమం కోసమే తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ధైర్యంగా ఎన్నికల బరిలోకి దిగడం గొప్ప విషయమని, ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో మనకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు ఉండరని, కేవలం విధానాల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయని ఆయన వివరించారు.
తెలంగాణ అభివృద్ధిలోనూ, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలోనూ భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తూనే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. కొండగట్టు పర్యటనతో తెలంగాణలోని జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
టీటీడీ నుంచి నిధులు..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. 35.19 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన అభ్యర్థనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన బోర్డు, భక్తుల సౌకర్యార్థం 96 గదుల అతిథి గృహంతో పాటు పలు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిందని వివరించారు. ఈ నిర్ణయం పట్ల పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.


