కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసన మండలి వేదికగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి, భూముల విక్రయాలపై ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి (Mahender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా రంగారెడ్డి జిల్లాలోని విలువైన భూములను విక్రయించి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారే తప్ప, ఆ జిల్లా అభివృద్ధికి తగిన వాటా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ప్రస్తావనల సమయంలో మహేందర్ రెడ్డి ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి నేటి వరకు గత ముప్పై ఏళ్లుగా జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నిన్నటి కేసీఆర్ ప్రభుత్వం వరకు అందరూ రంగారెడ్డి జిల్లా భూములను అమ్మే నిధులతోనే సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నడవాలన్నా లేదా రాష్ట్రవ్యాప్త సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా రంగారెడ్డి జిల్లా భూములే ఆధారం అవుతున్నాయని, కానీ స్థానికంగా జిల్లా అభివృద్ధికి మాత్రం మొండిచేయి ఎదురవుతోందని పేర్కొన్నారు.
జిల్లాలో ఎకరా భూమి ధర 150 కోట్ల రూపాయలకు పైగా పలుకుతోందని, అటువంటి విలువైన ఆస్తులను అమ్ముతున్నప్పుడు అందులో కనీసం 20 నుంచి 30 శాతం నిధులను నేరుగా జిల్లా అభివృద్ధి పనులకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తనలాంటి నాయకులను జిల్లా ప్రజలు నిలదీస్తున్నారని, భూముల అమ్మకం ద్వారా వస్తున్న నిధులు జిల్లాకు ఏ మేరకు వాడుతున్నారో చెప్పలేక తాము ఇబ్బంది పడుతున్నామని వివరించారు.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రంగారెడ్డి (Rangareddy) జిల్లా ప్రజలు తిరగబడతారని, పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైనా గతానికి భిన్నంగా వ్యవహరించి, జిల్లాలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చే ఆదాయంలో 40 శాతం వరకు జిల్లా అభివృద్ధి కోసమే ప్రత్యేకంగా కేటాయించాలని మహేందర్ రెడ్డి (Mahender Reddy) విజ్ఞప్తి చేశారు.
Read Also: వైసీపీ బాటలోనే బీఆర్ఎస్!
Follow Us On: Pinterest


