కలం వెబ్ డెస్క్: ఒక పార్టీ పక్కా సమైక్యాంధ్ర పార్టీ! మరో పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ!! మొదటి పార్టీ వైసీపీ.. రెండో పార్టీ బీఆర్ఎస్ (టీఆర్ఎస్)!! రెండు పార్టీల విధానాలు వేరైనా.. ఆ రెండు పార్టీల అధినేతలది మాత్రం విడదీయరాని అనుబంధం. అలయ్ బలయ్ బంధం!! జగన్.. ఏపీకి సీఎం అయ్యాక ఆయనను ఏకంగా తన అధికారిక నివాసం ప్రగతిభవన్‌కు తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ పిలిపించుకొని మరీ తమ మధ్య బేసిన్లు లేవు, భేషజాలు లేవని.. గోదావరి, కృష్ణాతో ఏపీని సస్యశ్యామలం చేస్తామన్నారు. నాడు రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి చేపల కూర తిని, రాయలసీమను రతనాలసీమ చేస్తామన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ రెండు పార్టీల నేతలు ఒకరి బాటలో ఒకరు నడుస్తున్నారు. ఏపీలో వైసీపీ సాగుతున్న తొవ్వలో తెలంగాణలో బీఆర్ఎస్ ఫాలో (BRS follows YCP) అవుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
అటు వాళ్లు డుమ్మా.. ఇటు వీళ్లూ డుమ్మా!
చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పెద్దగా రావడమే మానేశారు. ఆ పార్టీ అధినేత జగన్ అయితే.. ఆ వైపు ముఖం చూపెట్టడమే బంగారమైపోయింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మంకుపట్టు పట్టుకొని కూర్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 11. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10 శాతమైనా సీట్లు వచ్చి ఉండాలి. కానీ, వైసీపీకి ఆ మేరకు సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. తమకు ప్రతిపక్ష హోదాకు తగ్గట్టు ఓట్ల శాతం ఉందని, ఆ హోదా ఇవ్వాల్సిందేనని, దాని కోసమే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు, నిరసన తెలుపుతున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు.
ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బహిష్కరణ బాటనే అనుసరిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరైంది అంతంత మాత్రమే! ప్రతిపక్ష నేత, గులాబీ బాస్ కేసీఆర్ అయితే రెండేండ్లలో మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ గడప తొక్కారు. ప్రస్తుత సమావేశాల ప్రారంభం రోజు (డిసెంబర్ 29న) మూడంటే మూడు నిమిషాలు మాత్రమే ఆయన ఉండి, సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఆ మరుసటి అసెంబ్లీ రోజు (జనవరి 2).. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం వెళ్లిపోయారు.
తమ గొంతును అధికార పార్టీ నొక్కుతున్నదని, అందుకే బహిష్కరిస్తున్నట్లు వారు సమర్థించుకుంటున్నారు. కానీ.. ప్రజల సమస్యలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేతలు అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకే తీరుగా బహిష్కరణాస్త్రాలు, డుమ్మాల వ్యూహాలు సంధించడం విమర్శలకు తావిస్తున్నది. వైసీపీ బాటలోనే బీఆర్ఎస్ (BRS follows YCP) నడుస్తున్నదని.. వాళ్లది బేసిన్లు, భేషజాలు లేని బంధమని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.
Read Also: రూ.65 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షించాం : హైడ్రా కమిషనర్
Follow Us On: Instagram


