కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గెలుపు ఓటములను నిర్ణయించే ‘ఒక్క ఓటు’ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. చెన్నూరు మండలంలోని బావురావుపేటలో ఒక్క ఓటు తేడాతో తలెత్తిన వివాదం, చివరకు తలలు పగులగొట్టుకునే స్థాయికి చేరింది.
కాంగ్రెస్, రెబల్ హోరాహోరీ పోరు..
బావురావుపేట పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి, అదే పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కౌంటింగ్ చివరి దశకు వచ్చేసరికి ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం ‘ఒక్క ఓటు’ మాత్రమే ఉండటంతో వివాదం మొదలైంది. ఆ ఒక్క ఓటు తమదంటే తమదని ఇరు వర్గాలు పట్టుబట్టడంతో మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడులకు దారితీసింది.
రణరంగమైన కౌంటింగ్ కేంద్రం..
గెలుపుపై స్పష్టత లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు, అభ్యర్థుల అనుచరులు ఒక్కసారిగా కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో కౌంటింగ్ విధుల్లో ఉన్న అధికారులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒక గదిలోకి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీతాగోంది వద్ద ఉత్కంఠ..
మరోవైపు సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బావురావుపేట ఘటన ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తోంది. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
Read Also: ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకంపై నిషేధం
Follow Us On: Instagram


