కలం డెస్క్ : కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మంటలు పడుతున్నాయి. పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. కత్తులు దూసుకుంటున్నాయి. ఒకదానిపై మరొకటి నెపం నెట్టుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన కామెంట్లు బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌కు ఊపిరిలూదినట్లయింది. అటు కేసీఆర్‌ను, ఇటు హరీశ్‌రావుపై (Harish Rao) నిప్పులు చెరిగారు. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు గడ్డ మీద నుంచి కవిత కామెంట్లు చేయడం గులాబీ నేతలను ఆత్మరక్షణలో పడేసినట్లయింది. అసెంబ్లీ సమావేశాల్లో కవిత కామెంట్లను కాంగ్రెస్ ప్రస్తావించి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడానికి మార్గం సుగమమైంది.
కేసీఆర్ నిర్లక్ష్యం, మౌనమే శాపమైంది :
బేసిన్లు లేవ్.. భేషజాల్లేవ్.. అంటూ వైఎస్ జగన్‌తో కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన భరోసాపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతున్నది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత సైతం అదే మౌనాన్ని ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంగానీ, ఆ పార్టీకి చెందిన నేతలు గానీ అడ్డుకోలేదని, కోర్టుల్లో కేసులు వేయలేదని నాగర్‌కర్నూల్ వేదికగా కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి చొరవతో స్థానిక రైతులు కేసులు వేశారని, ఆ కారణంగానే ఎన్జీటీ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు వేసిందని గుర్తుచేశారు. విధిలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ మౌనమే ఏపీ ప్రభుత్వానికి అడ్వాంటేజ్‌గా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో పెద్ద మిస్టరీయేనని అన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ వరకు :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నీళ్ళ అంశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా జలాలే కీలకమైన అంశమని ప్రస్తావించిన కవిత… కృష్ణా జలాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అన్యాయమే జరిగిందని ఆరోపించారు. అసలు యుద్ధం జరిగిందీ… నీళ్ళలో నిప్పు రవ్వలు వచ్చిందీ… నీటి హక్కుల కోసమేనని వ్యాఖ్యానించిన ఆమె.. ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో నీటి హక్కులనే కోల్పోతున్నామని, పదేండ్లలో జరిగింది అదేనని అన్నారు. పోతిరెడ్డిపాడుకు గతంలో 45 వేల క్యూసెక్కుల చొప్పన నీరు వెళ్తే ఇప్పుడు అది 90 వేల క్యూసెక్కులకు పెరిగిందని, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించేలా ప్లాన్ చేసినా తెలంగాణ నుంచి కనీసం ప్రతిఘటన లేకపోవడాన్ని ప్రస్తావించారు. చివరకు 299 టీఎంసీలు చాలంటూ ఒప్పందంపై సంతకం చేయడం ఒక నష్టమైతే, ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఆ మేరకైనా నీటిని వాడుకోలేకపోవడం బీఆర్ఎస్ చేసిన తప్పిదమన్నారు.
నీటి హక్కులు కోల్పోవాల్సి వస్తున్నది :
కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర ప్రజల్లో ఒక సాధారణ అభిప్రాయమే ఉన్నది. సరిగ్గా దీన్నే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు, పరుగులు పెట్టించినట్లుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ కేసీఆర్ వ్యవహరించలేదన్నారు. వెనకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో మనకు దక్కాల్సిన కృష్ణా జలాల్లో వాటాను కోల్పోయినట్లయిందన్నారు. ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు జరిగితే మనకు ఇప్పుడు నష్టమే జరుగుతుందన్నారు. ఏపీ మాత్రం వరద జలాల ఆధారంగా లిఫ్ట్ ప్రాజెక్టులు కడుతున్నామని నమ్మిస్తూ నీటి హక్కులు పొందగలుగుతున్నదన్నారు. ఇప్పటికీ టీఎంసీల నీటి కొట్లాట జరుగుతూనే ఉన్నదన్నారు.
ప్రారంభోత్సవాలు సరే.. పారిన నీరేది? :
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ హడావిడిగా వట్టెం రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న పంప్‌హౌజ్‌లో ఒక మోటార్‌ను ఆన్ చేశారుగానీ ఆ నీటిని పారించేలా కాల్వల వ్యవస్థే లేదని కవిత (Kavitha) ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు పారినట్లు గులాబీ లీడర్లు గొప్పగా చెప్పుకుంటున్నా వారు హామీ ఇచ్చిన 30 లక్షల ఎకరాల సంగతేంటని నిలదీశారు. డిండి ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తీసుకోవాలనే సోర్స్ విషయంలో పదేండ్లయినా తేలలేదని, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయమే జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు జూరాల లైఫ్ లైన్ అని, దీన్ని వదిలిపెట్టి పాలమూరు ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వాటర్ సోర్స్ పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. శ్రీశైలం అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో రెండు రాష్ట్రాల జుట్టు కేంద్రం చేతిలోకి వెళ్తుందని, పర్మినెంట్ వివాదంగానే ఉండిపోతుందన్నారు.
రేవంత్‌రెడ్డి వచ్చినా ఒరిగిందేమీ లేదు :
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తన సొంత జిల్లాకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించిన కవిత… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని 21 ప్యాకేజీల్లో మూడు తీసేసి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. మిగిలిన 18 ప్యాకేజీల్లో పనులు ఎటూ తేలలేదని, నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇన్‌టేక్ పాయింట్‌ను బీమా ప్రాజెక్టుకు లింక్ పెట్టడంతో అదనంగా నీటి వాటా వచ్చే అవకాశమే లేదన్నారు. జూరాలను ఇన్‌టేక్‌గా పెట్టుకుంటే ఎక్కువ నీరు వాడుకునే అవకాశం ఉండేదని, అలా కాకుండా బీమాను ఎంచుకోవడం ద్వారా పాలమూరులో ప్రాజెక్టులోని వాటాకు కోత పెట్టినట్లయిందన్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో 13 గెలిపిస్తే కాంగ్రెస్ చేసింది ఇదేనా అని ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు కాంట్రాక్టులిచ్చి కరప్షన్, డైవర్షన్‌కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు.
కాంట్రాక్టర్‌తో హరీశ్‌రావు కుమ్మక్కు :
పాలమూరు ప్రాజెక్టులో మొదటి పంప్ హౌజ్‌ను ఎల్లూరు దగ్గర తొలుత ఓపెన్ పంప్ హౌజ్‌గా నిర్మాణం చేయాలని భావించినా చివరకు అండర్‌గ్రౌండ్ గా మార్చిన హరీశ్‌రావు కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్‌తో లాలూచీ పడ్డారని కవిత (Kavitha) ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం జరగొద్దనే ఓపెన్ పంప్‌హౌజ్‌గా డిజైన్ చేసినా చివరకు అండర్‌గ్రౌండ్‌గా మార్చడంతో కల్వకుర్తిలోని థర్డ్, ఫిఫ్త్ పంపులు డ్యామేజ్ అయ్యాయని గుర్తుచేశారు. దీంతో ఇప్పటికీ కల్వకుర్తిలో మూడు పంపులే పనిచేస్తున్నాయన్నారు. మోటార్లు రిపేర్ చేయడానికి కూడా అవకాశాల్లేవన్నారు. కారణం వీటికి మిషన్ భగీరధను లింక్ చేయడంతో ఒక్క రోజు రిపేర్ పనులు జరిగినా వందలాది గ్రామాలకు తాగడానికి నీటి సరఫరా ఆగిపోతుందన్నారు.
Read Also: గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం: డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Pinterest


