కలం, వెబ్ డెస్క్ : గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. శనివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని అనంత నగర్‌లో ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించడంతో పాటు, మరో కొత్త సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పాలకులు గత పదేళ్లలో సుమారు రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర సంపదను పెంచి, అందులో ప్రతి పైసాను ప్రజలకే పంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశామని, లబ్ధిదారులకు వారం వారం బిల్లులు చెల్లిస్తూ పనుల్లో జాప్యం లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసిందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని తిరిగి వారి సంక్షేమానికే ఖర్చు చేయడమే ప్రభుత్వ పరమావధి అని భట్టి(Bhatti Vikramarka) పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను చేపడుతోందని వివరించారు.
Read Also: పాలమూరు ఇష్యూ: అసెంబ్లీ ముంగిట KCRని ఇరికించిన కవిత
Follow Us On: Sharechat


